Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. కాగా.. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా సహా పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా.. ఇలాంటి సమయంలో రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్ తో శాంతి చర్చలు నిలిచిపోయినట్లు వెల్లడించింది. శాంతి స్థాపన జరగకుండా యూరోపియన్ దేశాలు అడ్డుకుంటున్నాయని మాస్కో ఆరోపించింది. చర్చలు జరిపేందుకు తాము ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని ప్రకటించింది. ఈ మేరకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘కమ్యూనికేషన్ ఛానెల్స్ పనిచేస్తున్నాయి. వీటి ద్వారా మా రాయబారులు చర్చలు జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇవి తాత్కాలికంగా నిలిచిపోయాయనే చెప్పగలం. అయినప్పటికీ శాంతి చర్చలు కొనసాగించేందుకు మేం సుముఖంగానే ఉన్నాం. యూరోపియన్ దేశాలే వీటిని అడ్డుకుంటున్నాయనేది వాస్తవం’’ అని అన్నారు.
Read Also: Nepal Crisis: నేపాల్ తాత్కాలిక ప్రధానిపై వీడిన ఉత్కంఠ.. సుశీల కర్కేకే బాధ్యతల అప్పగింత
ఉక్రెయిన్ పై దాడులు
చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో ఉక్రెయిన్ పై యుద్ధం గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడారు. చర్చల ద్వారా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగింపు పలికే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ను నాటో కూటమిలోకి లాక్కోవాలనే పశ్చిమదేశాల ప్రయత్నమే అసలు సంక్షోభానికి కారణమన్నారు. కచ్చితంగా యుద్ధం మూలాల్లోకి వెళ్లే పరిష్కారాలను కనుగొనాలని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఇటీవలే ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఉక్రెయిన్ పై రష్యా ఏకంగా 800కుపైగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. యుద్ధం మొదలైనప్పట్నుంచి ఈ స్థాయిలో గగనతల దాడులు చేపట్టడం ఇదే మొదటిసారి. అదేవిధంగా తొలిసారి ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ ప్రతినిధి యూరీ ఇన్హాత్ ఈ దాడులను ధ్రువీకరించారు. మాస్కో 13 క్షిపణులూ ప్రయోగించిందన్నారు. 747 డ్రోన్లు, నాలుగు క్షిపణులను నేలకూల్చినట్లు చెప్పారు. 54 డ్రోన్లు, తొమ్మిది క్షిపణులు కీవ్ సహా దేశవ్యాప్తంగా 37 ప్రాంతాలను తాకినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో ఓ చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు.
Read Also: Pakistan Shamed At UN: అంతర్జాతీయ వేదికపై మరోసారి పాక్ కు భంగపాటు..!


