Russia- Iran Putin Response: అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి ఘటనను.. సినికల్ మర్డర్‌గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. ఇరాన్‌పై దాడి ఘటన అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అంటూ మండిపడ్డారు. దాడుల్లో ఖమేనీ కుటుంబీకులు, సైనిక అధికారులు కూడా మృతి చెందడంతో ఇరాన్ ప్రతీకార చర్యలతో విజృంభిస్తోంది.
Also Read: https://teluguprabha.net/international-news/iran-interim-new-supreme-leader-ayatollah-alireza-arafi/
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ‘సినికల్ మర్డర్'(కిరాతక హత్య)గా అభివర్ణించారు.ఇది అంతర్జాతీయ చట్టాలను, మానవత్వాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొంటూ.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు పుతిన్ ఓ లేఖ రాశారు. ‘ఖమేనీని రష్యాలో అత్యుత్తమ రాజనీతిజ్ఞుడిగా గుర్తుంచుకుంటాం. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారు.’ అని లేఖలో పేర్కొన్నారు.
శనివారం ఇరాన్‌పై జరిగిన దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు సీనియర్ సైనిక అధికారులు మరణించినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఇరాన్ 40 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: https://teluguprabha.net/international-news/khamenie-death-iran-missile-attacks-target-us-bases/
ఈ మేరకు తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం తమ చట్టబద్ధమైన హక్కు, బాధ్యత అని స్పష్టం చేసిన ఇరాన్.. అమెరికా ఎయిర్ బేస్‌లే లక్ష్యంగా మిస్సైల్, డ్రోన్, బాంబు దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండటంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. యుద్ధవాతావరణంతో ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరగాలని.. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అధినేతలు సూచించారు.

