Russia-India strategic partnership : అగ్రరాజ్యం అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపిస్తుంటే.. చిరకాల మిత్రుడు రష్యా అండగా నిలుస్తున్నాడు. తమ నుంచి చమురు కొంటున్నందుకు భారత్‌పై అమెరికా సుంకాల భారం మోపడాన్ని ‘అన్యాయం’గా అభివర్ణించింది. స్నేహితుల మధ్య ఆంక్షల గోడలేంటని నిలదీసింది. ఇంతకీ, ఈ సుంకాల వెనుక అమెరికా వ్యూహమేంటి? రష్యా అందిస్తున్న భరోసా ఏంటి? ఈ పరిణామం అంతర్జాతీయ సంబంధాలను ఎలా ప్రభావితం చేయనుంది?
రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నారన్న కారణంతో భారత్‌పై అమెరికా ఏకంగా 50 శాతం సుంకాలు విధించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తొలుత 25 శాతంగా ప్రకటించిన ఈ సుంకాలను, అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా రెట్టింపు చేశారు. అయినప్పటికీ, భారత్ ఈ ఒత్తిడికి ఏమాత్రం తలొగ్గలేదు, పైగా ఆగస్టు నెలలో రష్యా నుంచి చమురు దిగుమతులను మరింత పెంచి తన సార్వభౌమ వైఖరిని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, భారత్‌పై అమెరికా అనుసరిస్తున్న వైఖరిని రష్యా తీవ్రంగా ఖండించింది.
ఆర్థిక వ్యవస్థను ఆయుధంగా వాడుతున్నారు: రష్యా : భారత్‌పై అమెరికా ఒత్తిడి తేవడం అత్యంత అన్యాయమని రష్యా సీనియర్ దౌత్యవేత్త రోమన్ బాబుష్కిన్ వ్యాఖ్యానించారు. “అమెరికా తన ఆర్థిక వ్యవస్థను ఒక ఆయుధంగా వాడుతోంది. నిజానికి, నిజమైన మిత్రులు ఎప్పుడూ ఒకరిపై ఒకరు ఆంక్షలు విధించుకోరు” అంటూ చురక అంటించారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా, భారత్-రష్యా ఇంధన సహకారం నిరాటంకంగా కొనసాగుతుందన్న పూర్తి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇది న్యూదిల్లీకి సవాలుతో కూడిన పరిస్థితి అని అంగీకరిస్తూనే, భారత్‌తో తమకున్న సంబంధాలపై పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
భారత్‌కు భరోసా.. మా మార్కెట్లు తెరిచే ఉన్నాయి : కేవలం మాటలకే పరిమితం కాకుండా, భారత్‌కు అండగా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని బాబుష్కిన్ తెలిపారు. భారత అవసరాల్లో 40 శాతాన్ని తామే తీరుస్తున్నామని, సగటున 5 శాతం డిస్కౌంట్‌తో, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చమురు సరఫరా చేసేందుకు మాస్కో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని ఆయన వెల్లడించారు. ఒకవేళ అమెరికా మార్కెట్లలో భారత ఎగుమతులకు ఇబ్బందులు ఎదురైతే, రష్యా మార్కెట్లు మన ఉత్పత్తులకు సాదర స్వాగతం పలుకుతాయని ఆయన భరోసా ఇచ్చారు.
చమురే కాదు.. అంతకుమించి : భారత్-రష్యా బంధం కేవలం చమురు వాణిజ్యానికే పరిమితం కాదని, అది అంతకుమించిన వ్యూహాత్మక భాగస్వామ్యమని బాబుష్కిన్ గుర్తుచేశారు. బ్రహ్మోస్ క్షిపణుల ఉమ్మడి తయారీని ప్రస్తావిస్తూ, ఇప్పుడు శక్తిమంతమైన జెట్ ఇంజిన్ల తయారీపైనా కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. చిన్న, మాడ్యులర్ అణు రియాక్టర్ల ఏర్పాటుపై చర్చలు పురోగతిలో ఉన్నాయని, ‘మేక్ ఇన్ ఇండియా’కు రష్యా సరైన భాగస్వామి అని ఆయన అన్నారు. అధ్యక్షుడు పుతిన్ కొద్ది వ్యవధిలోనే ప్రధాని మోదీతో రెండుసార్లు ఫోన్లో మాట్లాడటం, భారత్ పట్ల తమ దేశానికి గల ప్రాముఖ్యతను స్పష్టం చేస్తోందని ఒక అధికారి వెల్లడించారు.


