Sunday, February 8, 2026
Homeఇంటర్నేషనల్Russia-Ukraine : UAE వేదికగా చరిత్రాత్మక చర్చలు.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.?

Russia-Ukraine : UAE వేదికగా చరిత్రాత్మక చర్చలు.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.?

Russia Ukraine War : రష్యా-ఉక్రెయిన్ మధ్య గత రెండేళ్లకు పైగా కొనసాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికే దిశగా ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అగ్రరాజ్యం అమెరికా నేతృత్వంలో ఇప్పుడు సరికొత్త దౌత్య ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే రష్యా, అమెరికా, ఉక్రెయిన్ దేశాల మధ్య మొట్టమొదటిసారిగా త్రైపాక్షిక సమావేశం జరగబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు ఈ అత్యున్నత స్థాయి చర్చలు జరగనున్నట్లు దావోస్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు.

- Advertisement -
శాంతి దిశగా జెలెన్‌స్కీ ఆశాభావం

ఈ త్రైపాక్షిక సమావేశం చారిత్రాత్మకమని, ఇది యుద్ధం శాశ్వత ముగింపునకు గట్టి పునాది వేస్తుందని జెలెన్‌స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. దావోస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన దాదాపు గంటసేపు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ భేటీ అనంతరం జెలెన్‌స్కీ మాట్లాడుతూ, ట్రంప్‌తో జరిపిన సంభాషణలు అత్యంత సానుకూలంగా సాగాయని తెలిపారు. ఇప్పటికే ఉక్రెయిన్ బృందం ట్రంప్‌తో సమావేశమైందని, అలాగే అమెరికా ప్రతినిధుల బృందం చర్చల నిమిత్తం రష్యాకు వెళ్తోందని ఆయన వివరించారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, దేశ పునర్నిర్మాణం జరగాలన్నా, శాంతి నెలకొనాలన్నా దౌత్యపరమైన పరిష్కారమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.

యుద్ధం ముగియాలన్న ట్రంప్ ఆకాంక్ష

జెలెన్‌స్కీతో భేటీ తర్వాత అధ్యక్షుడు ట్రంప్ తన స్పందనను తెలియజేశారు. “ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, ఈ మారణకాండ ఇక ఆగాలి” అని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ముగించడానికి తాము చిత్తశుద్ధితో ఉన్నామని, తమ బృందం త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవబోతోందని చెప్పారు. ఇద్దరు నేతలు (పుతిన్, జెలెన్‌స్కీ) పట్టువిడుపులు ప్రదర్శించి, తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. మరిన్ని ప్రాణాలు పోకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Greenland : గ్రీన్‌లాండ్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్.. సుంకాల బెదిరింపు ఉపసంహరణ!

ట్రంప్ పట్టుదల.. ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలు
  • సౌదీ వేదికగా చర్చలు: తొలుత సౌదీ అరేబియా వేదికగా చర్చలు జరిపినప్పటికీ అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
  • నేరుగా చర్చలు: ఆ తర్వాత ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి అలాస్కాలో పుతిన్‌తో, ఆపై వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీతో విడివిడిగా సమావేశమయ్యారు.
  • 28 పాయింట్ల ప్రణాళిక: యుద్ధ నివారణ కోసం ట్రంప్ 28 పాయింట్లతో కూడిన ఒక శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి పుతిన్ సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ, ఉక్రెయిన్ ప్రయోజనాలకు భంగం కలుగుతుందన్న ఉద్దేశంతో జెలెన్‌స్కీ వ్యతిరేకించారు.

యూఏఈ చర్చలపై అంతర్జాతీయ ఆసక్తి

గతంలో జరిగిన ప్రయత్నాలన్నీ ఏదో ఒక కారణంతో విఫలమైనప్పటికీ, ఇప్పుడు యూఏఈలో జరగబోయే త్రైపాక్షిక సమావేశంపై ప్రపంచ దేశాలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. మూడు దేశాల ప్రతినిధులు ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటిసారి కావడంతో, ఈ చర్చల ద్వారా ఏదైనా సానుకూల ఒప్పందం కుదురుతుందేమోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ దౌత్య ప్రయత్నాలు యుద్ధ మేఘాలను తొలగించి శాంతిని పునరుద్ధరిస్తాయో లేదో రాబోయే రెండు రోజుల్లో తేలనుంది.

Ratha Sapthmi: వీటిని కానీ దానం చేశారంటే..మీ దరిద్రం పరార్‌!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News