Saif al-Islam Gaddafi : లిబియా మాజీ నియంత ముఅమ్మర్ గడాఫీ కుమారుడు సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ (53) దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత, రాజధాని ట్రిపోలికి నైరుతి దిశలో ఉన్న జింటాన్ పట్టణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తన నివాసంలోని తోటలో ఆయన ఉండగా, నలుగురు గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా మెరుపు దాడి చేసి కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సైఫ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. సైఫ్ రాజకీయ సలహాదారు అబ్దుల్లా ఒథ్మాన్ సోషల్ మీడియా ద్వారా ఈ మరణాన్ని ధృవీకరించడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.
Saturn: 30 ఏళ్ల తర్వాత ఊహించని సంఘటన..ఆ ఎఫెక్ట్ తో వీరికి
సన్నిహితుల హస్తంపై అనుమానాలు
ఈ హత్యకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సైఫ్ అల్-ఇస్లాంను చంపిన నలుగురు వ్యక్తులు ఆయనకు అత్యంత సన్నిహితులే అయి ఉండవచ్చని గడాఫీ కుటుంబ వర్గాలు అనుమానిస్తున్నాయి. బయటి వ్యక్తులు ఆయన నివాసంలోకి అంత సులభంగా ప్రవేశించడం సాధ్యం కాదని, లోపల ఉన్నవారి సహకారం లేకుండా ఈ దాడి జరగడం అసాధ్యమని భావిస్తున్నారు. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో, ఎవరూ ఊహించని విధంగా ఈ దాడి జరగడం వెనుక పెద్ద కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తిరుగుబాటు నుండి బందీ వరకు.. సైఫ్ ప్రస్థానం
2011లో నాటో మద్దతుతో లిబియాలో జరిగిన పెద్ద ఎత్తున తిరుగుబాటు కారణంగా గడాఫీ పాలన కుప్పకూలింది. ఆ సమయంలో ముఅమ్మర్ గడాఫీని తిరుగుబాటుదారులు కాల్చి చంపగా, సైఫ్ అల్-ఇస్లాం పారిపోవడానికి ప్రయత్నిస్తూ జింటాన్ మిలీషియా దళాలకు పట్టుబడ్డారు. అప్పటి నుండి సుమారు పదేళ్ల పాటు ఆయన ఒక మారుమూల కొండ పట్టణంలో బందీగా ఉన్నారు.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్న సైఫ్, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేవారు , పశ్చిమ దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు. తండ్రి మరణం తర్వాత కూడా లిబియా రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.
విఫలమైన రాజకీయ ప్రయత్నాలు
తండ్రి వారసుడిగా లిబియాను మళ్ళీ తన దారిలోకి తెచ్చుకోవాలని సైఫ్ అల్-ఇస్లాం ఎంతో ప్రయత్నించారు. అందులో భాగంగానే 2021లో జరిగిన లిబియా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. అయితే లిబియాలో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత , అంతర్గత విభేదాల కారణంగా ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
పదవిలో లేనప్పటికీ, చమురు సంపన్న దేశమైన లిబియాలో ఆయనకు ఇప్పటికీ పెద్ద ఎత్తున మద్దతు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన హత్య జరగడం లిబియా భవిష్యత్తుపై , అక్కడి రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
CM Chandrababu Naidu: లాభాల్లోకి విశాఖ ఉక్కు.. ప్రకృతి సాగులో సరికొత్త లక్ష్యాలు!

