నేపాల్-టిబెట్(Nepal-Tibet Border) సరిహద్దుల్లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం(Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు కనీసం 53 మంది మరణించినట్లు సమాచారం. మరో 62 మంది గాయపడినట్లు తెలుస్తోంది. భూకంప కేంద్రం ఉన్న టిబెట్ ప్రాంతంలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో మంగళవారం ఉదయం 6.35 గంటలకు ఈ భూకంపం సంభవించింది. టిబెట్‌లోని షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం తర్వాత టిబెట్ రీజియన్‌లో మరో రెండుసార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ ప్రకంపనల ప్రభావం భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపైనా కనిపించింది.