Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Shabana Mahmood: బ్రిటన్ పీఠంపై పాక్ మహిళ.. హోం సెక్రటరీగా షబానా చరిత్ర!

Shabana Mahmood: బ్రిటన్ పీఠంపై పాక్ మహిళ.. హోం సెక్రటరీగా షబానా చరిత్ర!

Shabana Mahmood’s historic appointment :  యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. దేశ అంతర్గత భద్రతకు అత్యంత కీలకమైన హోం కార్యదర్శి (హోం సెక్రటరీ) పదవిని తొలిసారిగా ఓ ముస్లిం మహిళ అలంకరించారు. పాకిస్థాన్ మూలాలున్న షబానా మహమూద్ ఈ అత్యున్నత బాధ్యతలను స్వీకరించి చరిత్ర సృష్టించారు. దేశం వలస విధానాలు, ఉగ్రవాదం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఆమె నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఎవరీ షబానా మహమూద్..? ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది..?

- Advertisement -

కీలక మార్పు.. కీలక బాధ్యత : యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తన మంత్రివర్గంలో చేపట్టిన కీలక పునర్వ్యవస్థీకరణలో భాగంగా షబానాకు ఈ ఉన్నత పదవి దక్కింది. య్వెట్ కూపర్ స్థానంలో ఆమెను నియమించారు. ఈ నియామకంతో దేశ అంతర్గత భద్రత, వలస విధానాలు, పోలీసు వ్యవస్థ వంటి అత్యంత కీలకమైన విభాగాలు ఇకపై షబానా పర్యవేక్షణలోనే పనిచేస్తాయి.

ఎవరీ షబానా మహమూద్ : షబానా ప్రస్థానం వలస కుటుంబాల స్ఫూర్తి గాథకు నిలువుటద్దం.

నేపథ్యం: ఆమె తల్లిదండ్రులు పాకిస్థాన్ నుంచి యూకేకు వలస వచ్చారు. షబానా 1980లో బర్మింగ్‌హామ్‌లో జన్మించారు.

విద్యాభ్యాసం: బాల్యాన్ని సౌదీ అరేబియాలో గడిపినప్పటికీ, ఉన్నత విద్య కోసం తిరిగి యూకే వచ్చారు. ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.

వృత్తి: రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు.

చట్టసభల్లోకి.. ఉన్నత పదవికి : 2010లో బర్మింగ్‌హామ్ లేడీవుడ్ నియోజకవర్గం నుంచి లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో గెలిచిన తొలితరం ముస్లిం మహిళా ఎంపీలలో ఒకరిగా ఆమె గుర్తింపు పొందారు. పార్టీలో ఎదుగుతూ పలు కీలక షాడో మంత్రి పదవులను నిర్వహించారు. 2024 ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయదుందుభి మోగించాక, ఆమెను న్యాయశాఖ కార్యదర్శిగా, లార్డ్ ఛాన్సలర్‌గా నియమించారు. ఆ హోదాలో జైళ్లలో రద్దీని తగ్గించడం, కోర్టు కేసుల సత్వర పరిష్కారం వంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టి తనదైన ముద్ర వేశారు. ఆమె పనితీరుకు గుర్తింపుగానే, ఇప్పుడు మరింత కీలకమైన హోం సెక్రటరీ పదవిని అప్పగించారు. షబానా నియామకాన్ని పలువురు స్వాగతిస్తూ, ఇది దేశ బహుళ సాంస్కృతికతకు నిదర్శనమని ప్రశంసిస్తున్నారు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad