US winter storm: అగ్రరాజ్యం అమెరికా గజగజ వణికిపోతోంది. మంచు తుపాను కారణంగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. ఇరవై లక్షల మంది ప్రజలు ఈ మంచు తుపానుతో అతలాకుతలం అవుతున్నారు. రహదారులు, కార్లతో సహా ఇళ్లుసైతం మంచుతో కప్పుకుపోతున్నాయి. అత్యంత కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవటంతో చలిగాలులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దాదాపు అమెరికా వ్యాప్తంగా 15లక్షలకుపైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు అంధకారంలో ఉండిపోయారు.
అమెరికాలో క్రిస్మస్ వేడుకలను అక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ప్రస్తుతం ఆదేశంలోని పలు ప్రాంతాల్లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తుండటంతో ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం సాగించే వీలులేకుండా పోయింది. హైవేలపై భారీగా మంచు పేరుకుపోయింది. వాహనం బయటకుతీస్తే మంచులో ఇరుక్కుపోయేలా అమెరికాలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి నెలకొంది. అటు విద్యుత్ సరఫరా లేక, మరోవైపు బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు.
అమెరికా వ్యాప్తంగా మంచు తుపాను కారణంగా విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నారు. దేశవ్యాప్తంగా శుక్రవారం 7,600 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 5వేల విమానాలు రద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులపై వాహనాలు ఢీకొంటుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మంచు తుపాను కారణంగా వారం రోజుల్లో 12 మంది మరణించారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని, లేకుంటే ఎవరూ బయటకు రావొద్దని అక్కడి అధికారులు హెచ్చరికలు సైతం జారీ చేశారు.