Quad Foreign Ministers Meeting: దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆక్రమణలపై ( భారత్‌తో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) లతో కూడిన క్వాడ్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల వాషింగ్టన్‌లో జరిగిన కీలక సమావేశంలో ఈ విషయమై మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అసలు దక్షిణ చైనా సముద్రంలో ఏం జరుగుతోంది? చైనా దూకుడుకు కారణమేంటి? దీనివల్ల మన దేశానికి ఏమైనా నష్టం ఉందా? శాంతికి భంగం వాటిల్లుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
చైనా సముద్రం అత్యంత కీలకం:
జూలై 1, 2025న వాషింగ్టన్‌లో అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌ల సభ్యులుగా ఉన్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దక్షిణ చైనా సముద్రంలోని పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “దక్షిణ చైనా సముద్రం మాకు అత్యంత కీలకం. ఇది అంతర్జాతీయంగా ప్రాధాన్యం గల సముద్ర మార్గం. ఇక్కడ వివాదాలు తలెత్తకుండా ఉండేలా చూసేందుకు క్వాడ్ సభ్యులందరూ కట్టుబడి ఉన్నాం” అని జైశంకర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఆసియా-పసిఫిక్‌లో భౌగోళిక, వ్యూహాత్మకంగా కీలకమైనదిగా గుర్తించబడింది.
చైనా చర్యలపై ఆందోళన:
దక్షిణ చైనా సముద్రంలో చైనా ‘9-డాష్ లైన్’ విధానంతో ఆక్రమణలు చేస్తోందని, వివాదాస్పద ద్వీపాలను మిలిటరైజ్ చేస్తోందని క్వాడ్ దేశాలు ఆరోపించాయి. ఈ చర్యలు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (యూఎన్‌సీఎల్ఓఎస్)ను ఉల్లంఘిస్తున్నాయని భారత్ భావిస్తోంది. నావికా స్వేచ్ఛకు అడ్డుకట్టలు, కోస్ట్ గార్డ్ నౌకలు, సైనిక విమానాల ద్వారా ప్రమాదకర పరిస్థితులు సృష్టించడం ఆందోళనకరమని క్వాడ్ సభ్యులు నిర్ణయించారు.
శాంతి కోసం ఉమ్మడి ప్రకటన:
సమావేశం అనంతరం క్వాడ్ దేశాలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో చైనా ఏకపక్ష చర్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. “ప్రస్తుత స్థితిని బలవంతంగా మార్చే చర్యలను ఆపాలి. ఇవి శాంతి, భద్రతకు ముప్పు” అని ప్రకటనలో పేర్కొన్నారు. యూఎన్‌సీఎల్ఓఎస్ ఒప్పందం ప్రకారం నావికా స్వేచ్ఛ, నిర్బంధ రహిత వాణిజ్యాన్ని కాపాడాలనే అంశాలని ముకుమ్మడిగా సమర్థించాయి.
భారత్‌కు అత్యంత కీలకమైన మార్గం:
భారత్ దక్షిణ చైనా సముద్రాన్ని ఆర్థిక అభివృద్ధి, వ్యాపార మార్గాలు, నౌకా రవాణా, సముద్ర భద్రత కోణంలో అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తోంది. ఈ మార్గంలో భారత వాణిజ్య నౌకల రాకపోకలు అధికంగా ఉంటాయి. మాలాక్కా స్ట్రెయిట్ ద్వారా చైనా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలతో వాణిజ్యం కోసం ఇది కీలకమైన లింక్‌గా ఉంది.
ఇండో-పసిఫిక్ శాంతి కోసం క్వాడ్ ప్రయత్నం:
జైశంకర్ పేర్కొన్నట్లు, ఇండో-పసిఫిక్‌లో శాంతి, భద్రత, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు భాగస్వామ్య దేశాలతో చర్చలు జరిగాయి. ఫిన్‌టెక్, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు పడ్డాయి. “ప్రాంతంలో అన్ని దేశాలు స్వేచ్ఛగా ఉండేలా చూసేందుకు క్వాడ్ కట్టుబడి ఉంది” అని జైశంకర్ స్పష్టం చేశారు. అయితే చైనా ఈ అంశం పై ఎలా స్పందిస్తుంది, క్వాడ్ ఐక్యత నిలుస్తుందా.. దక్షిణ చైనా సముద్రంలో శాంతి ఎంతకాలం ఉంటుందనేది కాలమే సమాధానం చెప్పాలని నిపుణులు పేర్కొంటున్నారు.