America-Spain:అమెరికా, ఇరాన్ యుద్దం నేపథ్యంలో స్పెయిన్ అగ్రరాజ్యానికి షాకిచ్చింది. అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఇరాన్‌తో జరుగుతోన్న యుద్ధంలో పాలుపంచుకొనే విమానాలను అనుమతించమని ఆ దేశ రక్షణ మంత్రి మార్గరెటా రొబెల్స్ సోమవారం వెల్లడించారు. ఇరు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తోన్న సైనిక స్థావరాలను పశ్చిమాసియా ఘర్షణల కోసం వినియోగించడాన్ని ఇప్పటికే స్పెయిన్ నిరాకరించిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు స్పెయిన్ రక్షణ శాఖ మంత్రి స్థానిక మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘ఇరాన్ యుద్ధానికి సంబంధించిన కార్యకలాపాల కోసం మిలిటరీ స్థావరాలు లేక గగనతలాన్ని వినియోగించడానికి అనుమతి ఇవ్వబోం. ఏకపక్షంగా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ప్రారంభించిన యుద్ధంలో సహకరించకూడదని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే తాజా ప్రకటన వచ్చింది’’ అని ఆమె వెల్లడించారు. ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తోన్న యుద్ధాన్ని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఈ దేశంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆ దేశంతో వాణిజ్యాన్ని నిలిపేస్తామని కూడా హెచ్చరించిన విషయం విధితమే.

