Monday, February 16, 2026
Homeఇంటర్నేషనల్Sri Lanka : లంకలో 'దిత్వ' దెబ్బ.. ఐఎంఎఫ్ బాటలో 'వంక' లేని పయనం!

Sri Lanka : లంకలో ‘దిత్వ’ దెబ్బ.. ఐఎంఎఫ్ బాటలో ‘వంక’ లేని పయనం!

Sri Lanka IMF austerity measures : శ్రీలంక నేడు “ముందు నుయ్యి.. వెనుక గొయ్యి” అన్న చందంగా తయారైంది. 2025 నవంబర్ చివరలో విరుచుకుపడిన ‘దిత్వ’ తుపాను ఆ ద్వీపదేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు, మౌలిక సదుపాయాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇలాంటి కష్టకాలంలోనైనా ప్రజలకు కాస్త ఊరట లభిస్తుందని ఆశించిన లంక పౌరులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశం ఎంతటి విపత్తులో ఉన్నా, అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) విధించిన కఠిన నిబంధనల నుంచి వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

- Advertisement -

విపత్తులోనూ వీడని ఆర్థిక నియమాలు : శ్రీలంక ప్రభుత్వం,  ఐఎంఎఫ్ ప్రతినిధుల మధ్య జరిగిన తాజా భేటీలో వెలువడిన కీలక అంశాలను పరిశీలిస్తే, దేశ ఆర్థిక భవిష్యత్తుపై ప్రభుత్వం ఎంతటి ఒత్తిడిలో ఉందో అర్థమవుతుంది.

ఐఎంఎఫ్ కితాబు – మార్పులేని ఒప్పందం: తుపాను మిగిల్చిన భారీ నష్టం తర్వాత ఐఎంఎఫ్ తన నిబంధనలను సడలిస్తుందని అందరూ భావించారు. అయితే, అధ్యక్షుడు దిస్సనాయకేతో జరిగిన సమావేశం అనంతరం ఐఎంఎఫ్ ప్రతినిధులు సంచలన ప్రకటన చేశారు. “తీవ్ర విపత్తులోనూ శ్రీలంక సరైన ఆర్థిక దిశలోనే పయనిస్తోంది” అని కొనియాడారు. దీంతో ‘ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ’ (EFF) ప్రోగ్రామ్ కింద కుదుర్చుకున్న ఒప్పందంలో ఎలాంటి మార్పులు ఉండబోవని తేల్చి చెప్పారు.

ప్రజాసంఘాల రణగళం: ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా సుమారు 70కి పైగా పౌర సమాజ బృందాలు, మేధావులు గళమెత్తారు. “దిస్సనాయకే ప్రభుత్వం ఐఎంఎఫ్ చేతిలో బందీగా మారింది” అని వారు మండిపడుతున్నారు. సాధారణ ప్రజలు ఇప్పటికే పన్నుల భారంతో, నిత్యావసరాల ధరలతో అల్లాడుతుంటే, తుపాను బాధితులకు ఊరటనివ్వకుండా కఠినమైన పొదుపు చర్యలు  కొనసాగించడం అమానవీయమని వారు విమర్శిస్తున్నారు.

సంక్షోభంలో సామాన్యుడు: ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆర్థికంగా పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ‘దిత్వ’ తుపాను వల్ల వ్యవసాయం, మత్స్య సంపద దెబ్బతిన్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం పన్నులు తగ్గించి, సబ్సిడీలు పెంచాల్సింది పోయి, ఐఎంఎఫ్ మెప్పు కోసం ‘పొదుపు’ మంత్రం పఠించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News