Sudan Darfur landslide tragedy : యుద్ధం, ఆకలితో అల్లాడుతున్న సూడాన్‌ను ప్రకృతి కూడా కరుణించలేదు. పశ్చిమ సూడాన్‌లోని డార్ఫుర్ ప్రాంతంలో మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటి చోటుచేసుకుంది. కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు పెళ్లలు పెళ్లలుగా విరిగిపడి ఒక గ్రామం మొత్తం భూస్థాపితమైంది. ఈ హృదయ విదారక ఘటనలో ఏకంగా వెయ్యి మందికి పైగా ప్రజలు సజీవ సమాధి కాగా, ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారని వెలువడుతున్న వార్తలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అసలు ఆ గ్రామంలో ఏం జరిగింది? ఈ మృత్యుఘోష వెనుక వాస్తవమెంత?
విలయం జరిగిందిలా : పశ్చిమ సూడాన్‌లోని సెంట్రల్ డార్ఫుర్ రాష్ట్రంలో, జెబెల్ మర్రా పర్వత శ్రేణుల ఒడిలో ‘టిర్సిన్’ అనే చిన్న గ్రామం ఉండేది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగష్టు 31వ తేదీన, ఆ గ్రామం పక్కనే ఉన్న కొండ భారీ వర్షాలకు పూర్తిగా నానిపోయి, ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. క్షణాల్లో టన్నుల కొద్దీ మట్టి, బండరాళ్లు గ్రామాన్ని కప్పేశాయి. నిద్రలో ఉన్న ప్రజలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే, ఊపిరాడక మట్టిలో కలిసిపోయారు. ఈ పెను విషాదం నుంచి అదృష్టవశాత్తూ ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం.
వెలుగులోకి తెచ్చిన ‘విముక్తి దళం’ : ఈ ప్రాంతంపై పట్టున్న ‘సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్/ఆర్మీ’ (SLM/A) అనే సాయుధ బృందం ఈ దారుణాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చింది. “టిర్సిన్ గ్రామం ఇప్పుడు పూర్తిగా నేలమట్టమైంది. గ్రామ జనాభా మొత్తం, అనగా వెయ్యి మందికి పైగా, ఈ దుర్ఘటనలో మరణించారు” అని ఆ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయం చేయాలని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సహాయ సంస్థలకు వారు విజ్ఞప్తి చేశారు. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సూడాన్‌లో, ముఖ్యంగా డార్ఫుర్ వంటి ప్రాంతాలలో, ప్రభుత్వ యంత్రాంగం కంటే ఇలాంటి స్థానిక బృందాలకే క్షేత్రస్థాయిలో ఎక్కువ పట్టు ఉంటుంది.
అధికారిక ధృవీకరణ కరవు.. ఎందుకంటే : సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్ వెల్లడించిన మృతుల సంఖ్యను అంతర్జాతీయ మీడియా సంస్థలుగానీ, సహాయక బృందాలుగానీ ఇంతవరకు స్వతంత్రంగా ధృవీకరించలేదు. దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలోని క్లిష్ట పరిస్థితులే. గత రెండేళ్లుగా సూడాన్ సైన్యానికి, పారామిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF)కు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా డార్ఫుర్ ప్రాంతం రావణకాష్ఠంలా రగులుతోంది. నిరంతరాయ ఘర్షణల వల్ల బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, సహాయక బృందాలు సైతం అక్కడికి చేరుకోవడం కష్టసాధ్యంగా మారింది. దీంతో ఈ ఘోర విపత్తు పూర్తి స్థాయి నష్టం, వాస్తవ మృతుల సంఖ్య తెలియరావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.


