సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 9 నెలల పాటు గడిపిన తర్వాత తిరిగి భూమికి రావడానికి సిద్ధమయ్యారు. వీరిని తిరిగి తీసుకురావడానికి నాసా-స్పేస్ ఎక్స్ క్రూ-10 ఐఎస్ఎస్‌ను చేరుకుంది. ఈ క్రూ శుక్రవారం ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ప్రయాణం ప్రారంభించింది. అయితే, సుదీర్ఘ అంతరిక్ష వాసం వల్ల విలియమ్స్ మరియు విల్మోర్‌లకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వీరికి ‘బేబీ ఫుట్’ అనే పరిస్థితి రావచ్చని నిపుణులు అంటున్నారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడంతో పాదాలు మృదువుగా మారి, నడక కష్టమవుతుంది.
భూమిపై నడిచేటప్పుడు పాదాల చర్మం గురుత్వాకర్షణ, ఘర్షణ కారణంగా మందంగా తయారవుతుంది. కానీ అంతరిక్షంలో ఈ ప్రక్రియ జరగదు. అంతేకాకుండా, గురుత్వాకర్షణ లేకపోవడంతో ఎముక సాంద్రత తగ్గిపోతుంది. నాసా ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతి నెల 1 శాతం ఎముక సాంద్రతను కోల్పోతారు. కండరాలు కూడా బలహీనపడతాయి. దీనివల్ల వారు తిరిగి భూమిపైకి వచ్చిన తర్వాత నడవడానికి చాలా ఇబ్బంది పడతారని అంటున్నారు.
అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో శరీరంలో రక్త ప్రసరణ కూడా మారుతుంది. గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. శరీరంలో కొన్ని ప్రాంతాలకు రక్త ప్రసరణ నెమ్మదిగా మారుతుంది.. దీనివల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. అంతరిక్షయానం వల్ల మరో ప్రమాదం రేడియేషన్. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం మనల్ని రేడియేషన్ నుండి రక్షిస్తుంది, కానీ అంతరిక్షంలో ఈ రక్షణ ఉండదు. నాసా ప్రకారం, వ్యోమగాములు భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో చిక్కుకున్న కణాలు, సౌర అయస్కాంత కణాలు, గెలాక్సీ కాస్మిక్ కిరణాలు అనే మూడు రకాల రేడియేషన్‌లకు గురవుతారు.