Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్India-China Relations : అగ్రరాజ్యం సుంకాల దాడి.. భారత్‌కు డ్రాగన్ అండ!

India-China Relations : అగ్రరాజ్యం సుంకాల దాడి.. భారత్‌కు డ్రాగన్ అండ!

US-India trade disputes : ఒకప్పుడు సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్విన చైనా… ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధంలో భారత్‌కు బాసటగా నిలవడం వెనుక ఆంతర్యమేమిటి? రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న ఒక్క కారణంతో అగ్రరాజ్యం అమెరికా మన దేశంపై సుంకాల కొరడా ఝుళిపించడం ఎంతవరకు సబబు..? డ్రాగన్ దేశం ఆపత్కాలంలో అందిస్తున్న ఈ స్నేహ హస్తం వెనుక ఉన్న దౌత్యపరమైన వ్యూహాలేమిటో వివరంగా పరిశీలిద్దాం…!

- Advertisement -

ప్రపంచ వాణిజ్య రంగంలో ప్రకంపనలు సృష్టిస్తూ, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న నెపంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలను చైనా తీవ్రంగా ఖండించింది. ఇది ఏకపక్ష నిర్ణయమని, ఇలాంటి వాణిజ్య యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే గొడ్డలిపెట్టు అని స్పష్టం చేసింది. దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత్‌లోని చైనా రాయబారి జు ఫీహాంగ్‌ ఈ విషయంపై మాట్లాడుతూ, అమెరికా ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.

“స్వేచ్ఛా వాణిజ్యంతో అపారంగా లబ్ధి పొందిన అమెరికానే ఇప్పుడు ఇతర దేశాలపై సుంకాల దాడికి పాల్పడటం విడ్డూరం. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఏకంగా 50 శాతం సుంకాలు విధించి, వాటిని మరింత పెంచుతామని హెచ్చరించడం బెదిరింపు చర్యే. ఇలాంటి బెదిరింపులకు తలొగ్గితే, వారికి మరింత ధైర్యం వస్తుంది. ఈ క్లిష్ట సమయంలో మేము భారత్‌కు వెన్నుదన్నుగా నిలుస్తాం” అని ఆయన ఉద్ఘాటించారు.

ట్రంప్ ఆగ్రహానికి అసలు కారణం : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి మాస్కోపై అమెరికా, ఐరోపా దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. అయితే, భారత్, చైనాలు తమ ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ కొనుగోళ్ల వల్లే రష్యాకు ఆర్థికంగా బలం చేకూరి, యుద్ధాన్ని కొనసాగించగలుగుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. చైనాను ఆర్థికంగా నేరుగా దెబ్బతీయలేని నిస్సహాయతలో, ట్రంప్ తన ఆగ్రహాన్ని భారత్‌పై చూపిస్తున్నారని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొదట 25% ప్రతీకార సుంకాలు విధించిన ఆయన, ఆ తర్వాత మరో 25% పెనాల్టీ సుంకాన్ని జోడించి మొత్తం భారాన్ని 50 శాతానికి పెంచారు. ఈ ఒత్తిడితో భారత్‌ను రష్యాకు దూరం చేయాలన్నది ఆయన వ్యూహం.

ఐక్యతే బలం : అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, చైనాలు ఐక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను జు ఫీహాంగ్‌ నొక్కిచెప్పారు. “మన రెండు దేశాల మధ్య స్నేహం కేవలం ఆసియాకే కాకుండా యావత్ ప్రపంచానికి మేలు చేస్తుంది. ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి భారత్, చైనాలు డబుల్ ఇంజిన్ల వంటివి” అని ఆయన అభివర్ణించారు. త్వరలో టియాంజిన్‌లో జరగనున్న ‘షాంఘై సహకార సంస్థ’ (SCO) సదస్సు వేదికగా ఇరు దేశాల సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది “శత్రువుకు శత్రువు మిత్రుడు” అన్న నానుడిని గుర్తుచేస్తోంది.

అమెరికా వాణిజ్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా చైనా, భారత్‌కు మద్దతు పలకడం ఒక కీలక పరిణామం. ఇది ఒకవైపు ఇరు దేశాల మధ్య మంచు కరిగేందుకు దోహదపడినా, మరోవైపు అమెరికాతో సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సంక్లిష్టమైన దౌత్య చదరంగంలో భారత్ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad