ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఒసాము సుజుకీ (Osamu Suzuki) కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్‌తో డిసెంబర్ 25న తుదిశ్వాస విడిచినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన మృతి పట్ల దిగ్గజ కంపెనీల ప్రతినిధులు తమ సంతాపం తెలియజేశారు.
1930 జనవరి 30న జపాన్‌లోని గెరోలో ఒసాము జన్మించారు. ఆయన అసలు పేరు ఒసాము మత్సుడా. స్థానిక బ్యాంకులో లోన్ ఆఫీసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1958లో షోహో సుజుకీని వివాహం చేసుకున్నారు. కంపెనీకి చెందిన కార్లు, మోటార్ సైకిళ్లను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో కీలకభూమిక పోషించారు.
ఈయన హయాంలోనే 1980ల్లో భారత్‌లోకి సుజుకీ ఎంట్రీ ఇచ్చింది. తొలుత మారుతీ ఉద్యోగ్ పేరిట ప్రభుత్వంతో కలిసి ఆటోమొబైల్ జాయింట్ వెంచర్‌ను ప్రారంభించింది. తర్వాతి కాలంలో మారుతీ సుజుకీగా అవతరించింది. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా ఉంది. ఈ కంపెనీ అప్పట్లో తీసుకొచ్చిన మారుతీ 800 కారు దేశీయంగా సంచలనమే సృష్టించింది.