Sweden Becomes First Country to Go 100% Cage Free for Hens: ప్రపంచవ్యాప్తంగా కోళ్ల పెంపకం ఒక భారీ పరిశ్రమగా వెలుగొందుతోంది. అయితే, వాటిని ఇరుకైన బోనులలో పెట్టి పెంచడం వల్ల.. వాటి స్వేచ్ఛ హరిస్తున్నట్లు జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. స్వేచ్ఛాయుత వాతావరణంలో కోళ్లు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, సరైన పరిష్కారం కనుక్కోలేక సతమతమవుతున్నాయి. అయితే, స్వీడెన్ దేశం మాత్రం ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుని స్వేచ్ఛాయుత వాతావరణంలో కోళ్లు పెంచుతూ అద్భుత విజయాన్ని సాధిస్తోంది. కోళ్ల పెంపకం విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తొంది. కోళ్ల పెంపకం విషయంలో వినియోగదారులు, సంస్థలు ఎలా కలిసి పని చేయగలవో స్వీడెన్ చేసి చూపించింది. భారత్‌తో సహా పలు అభివృద్ది చెందిన, అభువృద్ధి చెందుతున్న దేశాలు ఈ కొత్త రకమైన మార్గాన్ని ఎంచుకొని కోళ్లను బోనుల్లో కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో పెంచాలని కోరుతున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం.
Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-police-advice-to-public/
బోనులో కాకుండా స్వేచ్ఛగా కోళ్ల పెంపకం..
స్వీడన్ పశుసంక్షేమ సంస్థ చేపట్టిన ‘ప్రాజెక్ట్ 1882’ ప్రకారం, ఇకపై స్వీడెన్‌లో కోడిగుడ్లు పెట్టే కోళ్లు బోనులలో అస్సలు ఉండవు. అయితే, బోనులో కోళ్ల పెంపకంపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించనప్పటికీ.. పశుసంక్షేమ సంస్థ సహకారంతో ప్రభుత్వం సాధించిన ఒక గొప్ప మైలురాయిగా దీన్ని పేర్కొనవచ్చు. అసలు వివరాల్లోకి వెళ్తే.. 1988లో స్వీడిష్ పార్లమెంట్ మొదట బోను పెంపకం వ్యవస్థలను నిషేధించాలని నిర్ణయించింది. కానీ ఆ నిర్ణయాన్ని చాలా కాలం పాటు అమలు చేయలేదు. 2000 సంవత్సరం ప్రారంభంలో ‘ప్రాజెక్ట్ 1882’ పేరుతో స్వీడన్ తన ప్రచారం ప్రారంభించింది. ఆ సమయంలో స్వీడెన్‌లో దాదాపు 40% కోళ్లు బోనులలో ఉండేవి. అప్పటి నుండి, రిటైలర్లు, ఫుడ్ సర్వీస్ చైన్ లతో సహా 85కి పైగా కంపెనీలు బోనుల్లో పెంచే కోడి గుడ్లను సరఫరా చేయకుండా దశలవారీగా నిలిపివేయడం ప్రారంభించాయి. దీంతో, చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను సాధించింది. స్వీడన్ తీసుకున్న “ప్రాజెక్ట్ 1882” ద్వారా 2024 నాటికి బోను ఆధారిత కోళ్ల పెంపకం 1% కంటే తక్కువగా తగ్గింది. 2025 నాటికి అన్ని బోన్లు ఖాళీ అయ్యాయి. 2008 నుండి ఇప్పటి వరకు 1.7 కోట్ల కోళ్లకు స్వేచ్ఛ లభించింది. వినియోగదారుల ఒత్తిడి, జంతు స్వేచ్చా సంస్థల సహకారంతో ఈ మార్పు సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ పురోగతిని ఇలాగే కొనసాగిస్తామని, బోనుల పెంపకంపై చట్టపరమైన నిషేధం విధించాలని ప్రాజెక్ట్ 1882 కోరుతుంది.


