HomeTop StoriesSwitzerland Salaries: ఐఫోన్ కొనడానికి మూడు రోజుల పని చాలు.. స్విట్జర్లాండ్‌లో షాకింగ్ జీతాలు..

Switzerland Salaries: ఐఫోన్ కొనడానికి మూడు రోజుల పని చాలు.. స్విట్జర్లాండ్‌లో షాకింగ్ జీతాలు..

హైదరాబాద్‌, నవంబర్‌ 2 (తెలుగు ప్రభ): కొత్త ఐఫోన్ కొనుగోలు చేయాలంటే చాలా మందికి నెలల తరబడి డబ్బు కూడబెట్టాల్సి వస్తుంది. కానీ ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన స్విట్జర్లాండ్‌లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ పూర్తి సమయం పనిచేసే ఉద్యోగి మధ్యస్థ నెలవారీ స్థూల వేతనం 7,024 స్విస్ ఫ్రాంకులు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.7 లక్షలకుపైగా ఉంటుంది.

- Advertisement -

అంతటి భారీ వేతనాలే స్విట్జర్లాండ్ కొనుగోలు శక్తికి బలంగా నిలుస్తున్నాయి. ఒక తాజా ఐఫోన్ కొనుగోలు సామర్థ్య పోలికలో స్విట్జర్లాండ్ ప్రపంచంలోని అగ్ర దేశాల్లో ఒకటిగా నిలిచింది. సగటు ఉద్యోగి కేవలం మూడు ఎనిమిది గంటల పనిదినాల సంపాదనతో కొత్త ఐఫోన్ 17 ప్రోను కొనుగోలు చేయగలడని 2025 ఐఫోన్ అఫోర్డబిలిటీ ఇండెక్స్ వెల్లడించింది. ఈ పోలికలో లక్సెంబర్గ్ కూడా స్విట్జర్లాండ్‌తో సమానంగా మూడు పనిదినాల స్థాయిలో ఉంది.

నెల జీతం రూ.7 లక్షలకుపైగా

స్విస్ ఫెడరల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన 2024 గణాంకాల ప్రకారం.. దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ రంగాలను కలిపి పూర్తి సమయం పనిచేసే ఉద్యోగి మధ్యస్థ నెలవారీ స్థూల వేతనం 7,024 స్విస్ ఫ్రాంకులు. అత్యల్ప వేతనాలు పొందుతున్న 10 శాతం ఉద్యోగుల నెలవారీ వేతనం 4,635 ఫ్రాంకుల కంటే తక్కువగా ఉండగా, అత్యధిక వేతనాలు పొందుతున్న 10 శాతం ఉద్యోగుల వేతనం నెలకు 12,526 ఫ్రాంకులకు మించి ఉంది. అయితే 7,024 ఫ్రాంకులు ప్రతి ఉద్యోగి పొందే జీతం కాదు. ఇది మధ్యస్థ వేతనం. అంటే ఉద్యోగులందరి జీతాలను సగటుగా లెక్కించడం కాకుండా, వేతనాల పంపిణీలో మధ్యలో ఉన్న స్థాయిని ఈ గణాంకం సూచిస్తుంది.

అమెరికాకంటే ఒక రోజు ముందే

ఐఫోన్ 17 ప్రో కొనుగోలు చేయడానికి అమెరికాలోని సగటు ఉద్యోగికి సుమారు నాలుగు పనిదినాల సంపాదన అవసరమవుతోంది. కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఐదు పనిదినాలు అవసరం. స్విట్జర్లాండ్‌లో మాత్రం మూడు రోజులు సరిపోతున్నాయి. ఒకే స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి అవసరమయ్యే పని సమయాన్ని పోల్చడం ద్వారా వివిధ దేశాల ఉద్యోగుల కొనుగోలు శక్తిలో ఉన్న భారీ తేడా స్పష్టమవుతోంది.

ఎందుకంత ఎక్కువ జీతాలు?

స్విట్జర్లాండ్‌లో అధిక వేతనాలకు అక్కడి ఆర్థిక వ్యవస్థ స్వరూపమే ప్రధాన కారణం. అధిక నైపుణ్యం అవసరమయ్యే ఉద్యోగాలు, అధిక విలువ కలిగిన పరిశ్రమలు దేశంలో ఎక్కువగా ఉన్నాయి. పరిశోధన, అభివృద్ధి రంగంలో మధ్యస్థ నెలవారీ వేతనం 9,139 ఫ్రాంకులు కాగా, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో 10,159 ఫ్రాంకులు, బ్యాంకింగ్ రంగంలో 10,723 ఫ్రాంకులుగా ఉంది. కొన్ని అధిక విలువ కలిగిన రంగాల్లో వేతనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. అధిక ఉత్పాదకత, నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు డిమాండ్, బలమైన కరెన్సీ, ఫైనాన్స్, ఔషధ తయారీ, పరిశోధన వంటి రంగాల బలం స్విస్ వేతనాలను ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నాయి.

జీతం ఎక్కువ.. ఖర్చులూ అంతే

అయితే స్విట్జర్లాండ్‌లో భారీ జీతం ఉందంటే ఆ డబ్బంతా మిగులుతుందని భావించలేం. అక్కడ ఇళ్ల అద్దెలు, ఆరోగ్య బీమా, ఆహారం, ఇతర నిత్యావసరాల ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అందువల్ల స్విట్జర్లాండ్ జీతాలను భారతదేశంలోని జీతాలతో నేరుగా పోల్చడం సరైంది కాదు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒకే తరహా ప్రీమియం ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి ఉద్యోగి ఎన్ని రోజులు పని చేయాల్సి వస్తుందనే అంశంలో స్విట్జర్లాండ్ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపిస్తోంది.

భారత్‌లో మాత్రం 160 పనిదినాలు

ఈ పోలికలో అత్యంత ఆసక్తికరమైన విషయం దేశాల మధ్య కనిపిస్తున్న భారీ అంతరం. 33 దేశాలను పరిశీలించిన 2025 ఐఫోన్ అఫోర్డబిలిటీ ఇండెక్స్ ప్రకారం.. భారత్‌లోని సగటు ఉద్యోగి ఐఫోన్ 17 ప్రో కొనుగోలు చేయడానికి సుమారు 160 ఎనిమిది గంటల పనిదినాల సంపాదన అవసరమవుతుంది. స్విట్జర్లాండ్‌లో మూడు రోజులు సరిపోతుండగా, భారత్‌లో నెలల తరబడి పనిచేయాల్సిన పరిస్థితి ఉండటం కొనుగోలు శక్తిలోని అంతరాన్ని ప్రతిబింబిస్తోంది. ఒకే ఐఫోన్.. కానీ దేశాన్ని బట్టి దాన్ని కొనుగోలు చేయడానికి పడుతున్న సమయం భారీగా మారుతోంది. స్విట్జర్లాండ్‌లో మూడు రోజుల సంపాదనతో అందుబాటులోకి వచ్చే ఫోన్ కోసం మరో దేశంలో నెలల తరబడి పని చేయాల్సి రావడం ప్రపంచ దేశాల మధ్య వేతనాలు, కొనుగోలు శక్తిలో ఉన్న అసమానతకు అద్దం పడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News