Homeఇంటర్నేషనల్US Vs Iran: ఇరాన్‌పై అమెరికా దాడులతో మళ్లీ ఉద్రిక్తత.. పర్షియన్ గల్ఫ్‌లో తీవ్ర ఆందోళన

US Vs Iran: ఇరాన్‌పై అమెరికా దాడులతో మళ్లీ ఉద్రిక్తత.. పర్షియన్ గల్ఫ్‌లో తీవ్ర ఆందోళన

టెహ్రాన్‌(తెలుగుప్రభ): అమెరికా – ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై అమెరికా సైనిక చర్యలు చేపట్టినట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇరాన్‌లోని ఖేష్మ్‌ ద్వీపంలో పేలుళ్లు సంభవించినట్లు ఆ దేశ ప్రభుత్వ ప్రసార సంస్థ వెల్లడించింది. హార్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్‌ నౌకాదళం కోసం సముద్ర గనులు ఏర్పాటు చేస్తున్న బలగాలను లక్ష్యంగా చేసుకుని లారక్‌ ద్వీపంపై పరిమిత స్థాయిలో దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. అయితే ఈ వాదనను ఇరాన్‌ ఖండించింది. అనంతరం జోర్డాన్‌, యూఏఈలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు సమాచారం. హార్ముజ్‌ జలసంధిలో అమెరికాకు చెందిన ఎంక్యూ-9 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటించింది. మరోవైపు ఓ సూపర్‌ ట్యాంకర్‌ రెండు నౌకా గనులను ఢీకొన్నట్లు తెలిపింది. అమెరికా సైనిక సూచనలను పాటించవద్దని, అనుమతి లేని మార్గాల్లో ప్రయాణించవద్దని ఇరాన్‌ నౌకాయాన సంస్థలను హెచ్చరించింది.

- Advertisement -

ఇరాన్‌లో ఐఆర్‌జీసీ స్థావరాలపై దాడి చేసిన అమెరికా

వాణిజ్య నౌకలపై, అమెరికా సైనికులపై ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ దాడులకు ప్రయత్నించిన నేపథ్యంలో ఇరాన్‌లోని ఐఆర్‌జీసీ లక్ష్యాలపై దాడులు ప్రారంభించినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అమెరికా తూర్పు కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు దాడులు ప్రారంభించినట్లు వెల్లడించింది. మరోవైపు, నిరంతర సైనిక చర్యల కారణంగా అమెరికా బలగాలపై ఒత్తిడి పెరుగుతోందని సమాచారం. యూరప్‌, ఆసియా, లాటిన్‌ అమెరికాల్లో అమెరికా సైనిక బలగాలు విస్తరించి ఉండటంతో వనరులపై తీవ్ర ఒత్తిడి పడుతోందని ఉన్నతాధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. 50 వేల మందికి పైగా అమెరికా సైనికులు నెలలుగా అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం.

‘యుద్ధం కోరుకోవడం లేదు.. కానీ దాడులను ఎదుర్కొంటాం’

ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ తమ దేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే తమపై దాడి జరిగితే ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. అమెరికా గతంలో చేసుకున్న ఒప్పందంలోని హామీలకు తిరిగి కట్టుబడితే ఇరాన్‌ కూడా వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తుందని ఆయన తెలిపారు. జూన్‌లో కుదిరిన అవగాహన ఒప్పందంలో తక్షణ కాల్పుల విరమణ, 60 రోజుల పాటు విస్తృత శాంతి చర్చలు, హోర్ముజ్‌ జలసంధిలో సముద్ర గనులను తొలగించడం వంటి అంశాలు ఉన్నాయి. అయితే పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఆ ఒప్పందం కొద్దికాలానికే విఫలమైంది.

 

ఇరాన్‌పై బ్యాంకు ఆంక్షలకు అమెరికా సిద్ధం

ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు ఈ వారంలో ఓ బ్యాంకుపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెస్సెంట్‌ తెలిపారు. వచ్చే వారంలో మరో బ్యాంకుపై కూడా ఆంక్షలు ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించారు. మిత్రదేశాలతో ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీతో భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత కోసం చర్చలు, దౌత్యమే కీలకమని పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌ అవగాహన ఒప్పందాన్ని ఇరుపక్షాలు నిజాయితీగా అమలు చేయడం ద్వారానే సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

లెబనాన్‌, గాజాలోనూ ఉద్రిక్తతలు

ఇరాన్‌–అమెరికా ఘర్షణ ప్రభావం విస్తృత ప్రాంతానికి వ్యాపిస్తోంది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ కాల్పులు మళ్లీ ప్రారంభమైనట్లు సమాచారం. నాబ్లస్‌లో ఇజ్రాయెల్‌ బలగాలు దాడులు నిర్వహించాయి. గాజాలో జరిగిన ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో ఓ చిన్నారి సహా ఇద్దరు పాలస్తీనియన్లు మృతి చెందినట్లు సమాచారం.

హార్ముజ్‌ సమీపంలో ట్యాంకర్‌పై మూడు ప్రక్షేపకాలు

హార్ముజ్‌ జలసంధి నుంచి బయటకు వస్తున్న ఓ ట్యాంకర్‌పై మూడు గుర్తుతెలియని ప్రక్షేపకాలు దూసుకొచ్చినట్లు యూకే మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ సంస్థ తెలిపింది. ఒమన్‌లోని ఖసాబ్‌కు తూర్పున 17 నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

గ్రీస్‌తో ఇజ్రాయెల్‌ భారీ రక్షణ ఒప్పందం

గ్రీస్‌తో ఇజ్రాయెల్‌ 3 బిలియన్‌ యూరోల విలువైన రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఇరు దేశాల మధ్య కుదిరిన అతిపెద్ద రక్షణ ఒప్పందంగా ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘అకిలెస్‌ షీల్డ్‌’ పేరుతో బహుళస్థాయి వైమానిక రక్షణ వ్యవస్థను గ్రీస్‌కు అందించనున్నారు.

థాయ్‌లాండ్‌కు చేరనున్న యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌

మధ్యప్రాచ్యంలో సుదీర్ఘ మోహరింపు అనంతరం అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ థాయ్‌లాండ్‌లోని పట్టాయా సమీపంలో నౌకాశ్రయానికి చేరుకోనుంది. 5,000 మందికి పైగా అమెరికా సైనికులు ఈ పర్యటనలో థాయ్‌లాండ్‌కు రానున్నట్లు సమాచారం. స్థానిక పర్యాటక రంగానికి ఈ పర్యటన ఊతమిస్తుందని పట్టాయా మేయర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News