Saturday, July 12, 2025
Homeఇంటర్నేషనల్Floods: అమెరికాను ముంచెత్తిన భారీ వరదలు.. టెక్సాస్‌లో 24 మంది మృతి

Floods: అమెరికాను ముంచెత్తిన భారీ వరదలు.. టెక్సాస్‌లో 24 మంది మృతి

Texas Floods: అగ్రరాజ్యసం అమెరికాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు టెక్సాస్‌ను వరద నీరు చుట్టుముట్టింది. దీంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగతా బాలికలు కనిపించకుండా పోయారు. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. భారీ వర్షాలకు గ్వాడాలుపే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీని ప్రభావం కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. వరద తాకిడికి నివాసాలు మునిగిపోయాయి. వరదల్లో చిక్కుకున్న 200 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే దురదృష్టవశాత్తు 24 మంది వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

గ్వాడాలుపే నదీ తీరంలోని క్రిస్టియన్‌ క్యాంప్‌లో విద్యార్థులకు వేసవి శిక్షణాశిబిరం నిర్వహిస్తున్నారు. అయితే భారీ వర్షాల ధాటికి ఈ నది ఒక్కసారి ఉప్పొంగడంతో ఈ క్యాంప్‌ను వరదలు ముంచెత్తాయి. దీంతో అందులో ఉన్న 25 మంది బాలికలు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది పడవలు, హెలికాప్టర్ల సాయంతో తీవ్రంగా గాలిస్తున్నారు. దీంతో పిల్లల ఆచూకీ కోసం తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వారిని జాడ కనిపెట్టాలని అధికారులను వేడుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు.

నెల రోజుల్లో కురవాల్సిన వర్షం కొన్ని గంటల్లోనే పడటంతోనే టెక్సాస్ రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని.. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తొమ్మిది రెస్క్యూ బృందాలతో పాటు 14 హెలికాప్టర్లు, 12 డ్రోన్‌లను గాలింపు చర్యల కోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు. మరోవైపు సెంట్రల్ న్యూజెర్సీలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఉరుములతో కూడిన వర్షాల కారణంగా కనీసం ముగ్గురు మరణించినట్లు సమాచారం. మొత్తానికి అమెరికాలోని పలు రాష్ట్రాలు భారీ వర్షాల కారణంగా వణికిపోతున్నాయి. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.(Texas Floods)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News