Texas Flood Disaster Update : టెక్సాస్‌ను కకావికలం చేసిన జలప్రళయం.. భూకంపంలాంటి విలయం! ఎక్కడ చూసినా హాహాకారాలు, కన్నీళ్లు. కళ్ల ముందు కదులుతున్న ప్రాణాలు, కూలుతున్న ఆశలు. అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిపోయింది. కుండపోత వర్షాలతో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిన వరదలు, మానవ జీవనాన్ని అతలాకుతలం చేశాయి. నిమిషాల వ్యవధిలో నిలువునా మునిగిన గ్రామాలు, కొట్టుకుపోయిన ఇళ్లు, విగత జీవులుగా మారిన వందలాది ప్రాణాలు… ఈ విలయం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? టెక్సాస్ ఏడుపు వెనుక దాగున్న వాస్తవాలు..
మరింత పెరిగే అవకాశం : అమెరికా చరిత్రలోనే అత్యంత భీకరమైన వరదల్లో ఒకటిగా టెక్సాస్ జలప్రళయం నిలిచిపోయింది. కుండపోత వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 100కు పెరిగింది. మరో 41 మంది ఆచూకీ లేకుండా గల్లంతయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
వేసవి శిబిరాలపై వరదల ప్రతాపం: వరదల ధాటికి అత్యధికంగా నష్టపోయింది నదీ తీరాల్లో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాలే. టెక్సాస్‌లోని కెర్ కౌంటీ, టెక్సాస్ హిల్ కంట్రీలలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాలపై వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. ఈ ప్రాంతాల్లో 68 మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో 28 మంది చిన్నారులే ఉండటం విషాదకరం అని పోలీసు అధికారి లారీ లీథా కన్నీళ్లతో వెల్లడించారు. నదీ తీరంలో ఏర్పాటు చేసిన ఒక సమ్మర్ క్యాంపునకు హాజరైన 10 మంది బాలికలు, ఒక వ్యక్తి గల్లంతయ్యారని, వారి క్యాబిన్లు వరదల్లో కొట్టుకుపోయాయని పోలీసులు ప్రకటించారు. వారి ఆచూకీని గుర్తించే వరకు విస్తృత సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.
ప్రాణనష్టంపై అధికారిక ప్రకటనలు: అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని ట్రావిస్, బుర్నెట్, కెండాల్, టోమ్ గ్రీన్, విలియమ్సన్ కౌంటీలలో మొత్తం పది మంది మరణించారు. ఈ విపత్తుపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తొలిసారిగా కీలక ప్రకటన విడుదల చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 41 మంది గల్లంతయ్యారని, ఈ సంఖ్య మరింత పెరగొచ్చని వెల్లడించారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని టెక్సాస్ ప్రజా భద్రతా విభాగం కల్నల్ ఫ్రీమన్ మార్టిన్ అంచనా వేశారు.
సహాయక చర్యలకు ఆటంకాలు: భారీ వర్షాల కారణంగా సెంట్రల్ టెక్సాస్‌లో వరదలు సంభవించాయి. ఈ వరదలు సహాయక చర్యలకు పెద్ద ఆటంకంగా మారినప్పటికీ, రెస్క్యూ బృందాలు 850 మందిని సురక్షితంగా రక్షించగలిగాయి.
మంగళవారం వరకు వరద ముప్పు: తదుపరి మంగళవారం వరకు భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, వాటి వల్ల మరోసారి భీకర వరదలు సంభవించొచ్చని కల్నల్ ఫ్రీమన్ మార్టిన్ హెచ్చరించారు. నదులు కూడా ఉప్పొంగి ప్రమాదకర వరదలను సృష్టించే అవకాశం ఉందంటూ కెర్ కౌంటీలోని ప్రజల ఫోన్లకు అత్యవసర సందేశాలు అందాయి. కెర్ కౌంటీలోని క్యాంప్ మిస్టిక్ వద్ద ప్రజలను అప్రమత్తం చేయడానికి లౌడ్‌స్పీకర్‌ల ద్వారా ప్రకటనలు చేసి, ఆ ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు.
ఆకస్మిక స్పందనతో ప్రాణరక్షణ: జులై 4న టెక్సాస్ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిశాయి. ఆరోజు అర్ధరాత్రి 1 గంటకు టెక్సాస్‌లోని గ్వాడలూపే నదిలో నీటిమట్టం వేగంగా పెరగసాగింది. దీన్ని అరోల్డో బరేరా అనే సమ్మర్ క్యాంపు ఫెసిలిటీస్ మేనేజర్ గుర్తించి, తన బాస్‌కు సమాచారాన్ని అందించారు. వెంటనే నదీతీరంలో ఉన్న క్యాంపును మరో ప్రదేశానికి తరలించి, అక్కడ ఉన్న దాదాపు 70 మంది పిల్లలు, పెద్దలను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు. అయితే సమీపంలోని హంట్ అనే ప్రాంతంలో ఉన్న మరో సమ్మర్ క్యాంపును వరద జలాలు ముంచెత్తగా, అక్కడ వెంటనే సహాయక చర్యలు చేపట్టి, క్యాంపులో ఉన్న పిల్లలు, పెద్దలను రక్షించి సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఈ ఆకస్మిక స్పందన అనేక ప్రాణాలను రక్షించింది.


