Thailand-Cambodia conflict : రెండు బౌద్ధ దేశాలు.. శతాబ్దాల నాటి హిందూ దేవాలయాల కోసం యుద్ధం అంచున నిలబడ్డాయి. ఫిరంగులు, రాకెట్ల దాడులతో సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. ఈ ఘర్షణల వెనుక ఉన్న అసలు కారణం, దశాబ్దాలుగా రగులుతున్న వివాదం, ఆ ఆలయాల ప్రాముఖ్యత ఏమిటి…?
ఆగ్నేయాసియా దేశాలైన థాయ్‌లాండ్, కంబోడియాల మధ్య సరిహద్దు వివాదం కొత్తేమీ కాదు. అయితే, ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నది మాత్రం ఇరు దేశాల సరిహద్దుల్లో ఉన్న ప్రాచీన హిందూ దేవాలయాలు. ప్రధానంగా 9వ శతాబ్దంలో ఖెమర్ రాజులచే నిర్మించబడిన ప్రీహ్ విహార్, అలాగే ట మోన్ థోమ్, ట మ్యూన్ థోమ్ ఆలయాలు ఉన్న పర్వత ప్రాంతాలపై ఆధిపత్యం కోసం దశాబ్దాలుగా ఈ రెండు దేశాలు పోరాడుతున్నాయి. ఈ ఆలయాల్లో ఇప్పటికీ శివలింగాలు, సంస్కృత శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు కొలువై ఉండటం విశేషం.
దాదాపు 800 కిలోమీటర్ల పొడవైన ఈ సరిహద్దును చాలావరకు ఫ్రెంచ్ వలస పాలనలోనే గీశారు. అయినప్పటికీ, డాంగ్రెక్ పర్వత శ్రేణుల్లోని కొన్ని ప్రాంతాలపై స్పష్టత కొరవడింది. ఇదే నేటి ఉద్రిక్తతలకు ప్రధాన కారణమైంది.
ప్రీహ్ విహార్ ఆలయం : ఈ వివాదంలో అత్యంత కీలకమైంది ప్రీహ్ విహార్ శివాలయం. డాంగ్రెక్ పర్వత శిఖరాన ఉన్న ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో ఖెమర్ రాజులు నిర్మించారు. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని చారిత్రక తీర్పునిచ్చింది. థాయ్‌లాండ్ ఈ తీర్పును అంగీకరించినప్పటికీ, ఆలయం చుట్టూ ఉన్న 4.6 చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని వాదిస్తోంది.
పుండు మీద కారం చల్లినట్లు, కంబోడియా విజ్ఞప్తి మేరకు 2008లో యునెస్కో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీనిని థాయ్‌లాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. కంబోడియా చూపిన మ్యాప్ ద్వారా తమ భూభాగాన్ని ఆక్రమించుకుందని ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి.
మరో రెండు ఆలయాల కోసం మంటలు : ప్రీహ్ విహార్‌తో పాటు, థాయ్‌లాండ్‌లోని సురిన్ ప్రావిన్స్‌లో ఉన్న ట మోన్ థోమ్, ట మ్యూన్ థోమ్ అనే మరో రెండు శివాలయాల కోసం కూడా వివాదం కొనసాగుతోంది. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయాలు తమకే చెందుతాయని కంబోడియా వాదిస్తుండగా, థాయ్‌లాండ్ దీనిని అంగీకరించడం లేదు. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాలు, ప్రస్తుత ఘర్షణలతో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరిక : థాయ్‌లాండ్, కంబోడియా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయుల కోసం ఒక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ముఖ్యంగా సరిహద్దులకు సమీపంలో ఉన్న ఉబోన్ రాట్చథాని, సురిన్, సిసాకెట్, బురిరామ్ సహా ఏడు ప్రావిన్సులకు ప్రయాణాలు చేయవద్దని సూచించింది.పర్యాటకులు స్థానిక అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


