Thailand-Cambodia border dispute resolution: దశాబ్దాలుగా సరిహద్దు వివాదంతో రగులుతున్న థాయిలాండ్, కంబోడియా దేశాలు ఎట్టకేలకు శాంతి మంత్రం పఠించాయి. రోజుల తరబడి కొనసాగుతున్న భీకర దాడులకు స్వస్తి పలుకుతూ బేషరతుగా కాల్పుల విరమణకు అంగీకరించాయి. మలేషియా చొరవ, అమెరికా ఒత్తిడితో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. అసలు ఈ రెండు దేశాల మధ్య ఇంతటి శత్రుత్వానికి కారణమేంటి.? కేవలం సరిహద్దు గొడవలేనా లేక తెర వెనుక మరేదైనా బలమైన కారణం ఉందా..?
చర్చల సారాంశం.. శాంతికి మార్గం:
గత కొన్ని రోజులుగా థాయ్‌లాండ్, కంబోడియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ ఘర్షణల్లో ఇరువైపులా కలిపి 34 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 1,68,000 మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఆసియాన్ ప్రాంతీయ కూటమికి సారథ్యం వహిస్తున్న మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. పుత్రజయలో జరిగిన ఈ సమావేశంలో థాయ్‌లాండ్, కంబోడియా ప్రధానులు పాల్గొన్నారు. చర్చలు ఫలించి, తక్షణమే బేషరతుగా కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు ఆయన సమక్షంలో కరచాలనం చేసుకోవడం శాంతియుత వాతావరణానికి నాంది పలికింది.
ట్రంప్ హెచ్చరిక.. దిగివచ్చిన దేశాలు:
ఈ శాంతి చర్చల వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారు. ఘర్షణలు ఆపకపోతే ఇరు దేశాలతో వాణిజ్య ఒప్పందాలను నిలిపివేస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు. “ట్రూత్ సోషల్” వేదికగా తాను ఇరు దేశాల నాయకులతో మాట్లాడినట్లు, ఘర్షణలు కొనసాగితే వాణిజ్యంపై ప్రభావం పడుతుందని స్పష్టం చేసినట్లు ట్రంప్ తెలిపారు. ఈ ఒత్తిడి ఫలించి, రెండు దేశాలు మలేషియా నేతృత్వంలోని చర్చలకు హాజరయ్యాయి.
ALSO READ: https://teluguprabha.net/international-news/chinese-monastery-affair/
వివాదానికి మూలం.. దేవాలయాల గొడవ:
థాయిలాండ్, కంబోడియా మధ్య 508 మైళ్ల పొడవైన సరిహద్దు ఉంది. ఫ్రెంచ్ పాలనలోనే చాలా వరకు సరిహద్దును గుర్తించినప్పటికీ, కొన్ని ప్రాంతాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా, సరిహద్దుల్లోని ప్రాచీన హిందూ దేవాలయాలే ఈ గొడవలకు ప్రధాన కారణం. ప్రీహ్ విహార్, ట మోన్ థోమ్, ట మ్యూన్ థోమ్ వంటి చారిత్రక ఆలయాలున్న పర్వత ప్రాంతాలపై ఆధిపత్యం కోసం దశాబ్దాలుగా పోరాటం జరుగుతోంది. ఈ ఆలయాల్లో శివలింగాలు, సంస్కృత శాసనాలు, హిందూ దేవతల చిత్రాలుండటం విశేషం.
ప్రీహ్ విహార్ ఆలయం:
9వ శతాబ్దంలో ఖెమర్ రాజులు నిర్మించిన ఈ శివాలయం డాంగ్రెక్ పర్వత శిఖరంపై ఉంది. ఈ ఆలయం కంబోడియాకు చెందిందని..1962వ సంవత్సరంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఒక చారిత్రాత్మక తీర్పునిస్తూ, ఆ దేవాలయం కంబోడియా దేశానికే చెందుతుందని స్పష్టం చేసింది. యూనెస్కో 2008లో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడాన్ని థాయ్‌లాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది.
ALSO READ: https://teluguprabha.net/international-news/ancient-humans-ate-children-new-discovery-reveals/
ట మోన్ థోమ్, ట మ్యూన్ థోమ్:
థాయ్‌లాండ్‌లోని సురిన్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ ఆలయాలు కూడా వివాదాస్పదంగా మారాయి. ప్రసాత్ ట మోన్ థోమ్ అనే మరో శివాలయం తమకే చెందుతుందని చారిత్రక ఆధారాలతో కంబోడియా వాదిస్తుండగా, థాయ్‌లాండ్ దీనిని అంగీకరించడం లేదు. ఈ దేవాలయాలపై ఉన్న స్థానిక సెంటిమెంట్లు తరచూ ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయి. తాజా కాల్పుల విరమణ ఒప్పందంతో ఈ సుదీర్ఘ వివాదానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంతర్జాతీయ సమాజం ఆశిస్తోంది.


