Man Dies After Consuming Only Beer For A Month: బాధను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూపిస్తారు. చాలా మంది తినడం మానేస్తారు. అదీ ఒక పూటనో లేదా కొన్ని రోజులో. అయితే భార్య విడాకులు ఇచ్చి, వదిలేసి వెళ్లిపోయిందనే బాధలో ఓ వ్యక్తి ఏకంగా నెల రోజుల పాటు ఆహారం మానేశాడు. మనస్తాపంలో కేవలం బీర్‌లు మాత్రమే తాగేవాడు. దీంతో అనారోగ్యం బారినపడి అతడు ప్రాణాలు విడిచాడు. థాయిలాండ్‌లోని రాయోంగ్ ప్రావిన్స్‌లోని బ్యాన్ చాంగ్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుడి పడకగదిలో 100కు పైగా ఖాళీ బీరు సీసాలు లభించినట్లు పోలీసులు తెలిపారు.
ఏం జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 44 ఏళ్ల థాయ్వీసాక్ నామ్‌వొంగ్‌సా అనే వ్యక్తికి ఇటీవలే విడాకులు ఖరారయ్యాయి. వారి 16 ఏళ్ల కుమారుడిని తన దగ్గరే వదలి పెట్టి భార్య వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన నామ్‌వొంగ్‌సా ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేశాడు. బదులుగా, అనేక వారాల పాటు కేవలం బీరు మాత్రమే తాగేవాడు. తన కుమారుడు రోజూ భోజనం తీసుకువచ్చి తినిపించడానికి ప్రయత్నించినప్పటికీ, అతను తినడానికి నిరాకరించేవాడు.
సంఘటన జరిగిన రోజు, బాలుడు పాఠశాల నుండి తిరిగి వచ్చేసరికి నామ్‌వొంగ్‌సా అపస్మారక స్థితిలో ఉన్నాడు. తండ్రికి ఫిట్స్ రావడం గమనించి వెంటనే అత్యవసర సహాయం కోసం అర్థించాడు. అతడిని ఆస్పత్రిలో చేర్చేందుకు సియామ్ రాయోంగ్ అనే ఫౌండేషన్ ముందుకొచ్చింది. అయితే వారు రావడానికి ముందే నామ్‌వొంగ్‌సా చనిపోయాడు.
గది నిండా బీర్ బాటిళ్లే..
నామ్‌వొంగ్‌సా పడకగదిని చూసి పారామెడిక్ సిబ్బంది షాక్ అయ్యారు. నేల అంతా 100కు పైగా ఖాళీ బీరు సీసాలతో నిండి ఉంది. నడవడానికి కూడా కష్టంగా ఉన్న ఆ గదిలో కేవలం నామ్‌వొంగ్‌సా తిరగడానికి ఒక సన్నని మార్గం మాత్రమే ఉంది. విడాకుల తర్వాత నామ్‌వొంగ్‌సా తీవ్ర నిరాశకు గురయ్యాడని, ఇదే అతడిని ఆహారం మానేసి మద్యానికి బానిసయ్యేలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించలేదు. అయితే అధిక మోతాదులో మద్యం సేవించడమే ప్రధాన కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.


