Homeఇంటర్నేషనల్Pakistan: ఇస్లామాబాద్ కాదు.. కంటైనరాబాద్!

Pakistan: ఇస్లామాబాద్ కాదు.. కంటైనరాబాద్!

  • నిరసనల అణచివేతకు వేలాది కంటైనర్లతో దిగ్బంధం
  • ఇమ్రాన్‌ఖాన్ మార్చ్‌కు చెక్ పెట్టేందుకు సర్కారు వ్యూహం
  • లబోదిబోమంటున్న రవాణాదారులు
  • ఆందోళనల అణచివేతకు రూ.100 కోట్ల ఖర్చు
  • పాకిస్తాన్‌లో విచిత్రంగా ఎక్కడ చూసినా కంటెయినర్లే

ఇస్లామాబాద్, అక్టోబర్ 2 : పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మళ్లీ ‘కంటైనర్ల నగరం’గా మారింది. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌‌ఖాన్‌కు చెందిన ‘పీటీఐ’ పార్టీ నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వం నగరాన్ని భారీ స్టీల్ కంటైనర్లతో అష్టదిగ్బంధం చేసింది. రెడ్ జోన్, రాష్ట్రపతి భవన్ సహా కీలక మార్గాల్లో దాదాపు 2,000 కంటైనర్లను బారికేడ్లుగా పేర్చడంతో స్థానికులు దీనిని వ్యంగ్యంగా “కంటైనరాబాద్” అని పిలుస్తున్నారు.

- Advertisement -

రూ.100 కోట్ల ప్రజాధనం వృథా
ర్యాలీ వాయిదా పడటంతో భద్రతా వ్యయం రూ.82 కోట్ల నుంచి రూ.100 కోట్లకు (సుమారు 3.6 మిలియన్ డాలర్లు) చేరింది. 1,500కు పైగా కంటైనర్ల రోజువారీ అద్దె కోసమే నిత్యం సుమారు రూ.4.65 కోట్లు ఖర్చవుతున్నట్లు సమాచారం.

రవాణాదారులకు భారీ నష్టం.. డ్రైవర్ల దుస్థితి
పోలీసులు ప్రైవేట్ లారీలు, విదేశీ షిప్పింగ్ కంటైనర్లను బలవంతంగా స్వాధీనం చేసుకోవడంతో సుమారు 2,000 వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. ఒక్కో వాహనంపై రోజుకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు ఆదాయం కోల్పోతున్నామని, సర్కారు నుంచి ఎలాంటి పరిహారం అందడం లేదని ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ వాపోతోంది. విదేశీ కంటైనర్లను సకాలంలో అప్పగించకపోతే రోజుకు 150 నుంచి 300 డాలర్ల వరకు పెనాల్టీ పడుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వాహనాలకు కాపలాగా ఉంటున్న డ్రైవర్లు కనీస వసతులు లేక వారాల తరబడి దుమ్ముధూళిలోనే మగ్గుతున్నారు.

ప్రభుత్వ సమర్థన.. ఆర్థిక వ్యవస్థకు దెబ్బ
రాజధాని భద్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగానే కంటైనర్లను నిబంధనల ప్రకారం అద్దెకు తీసుకున్నామని సహాయ మంత్రి తలాల్ చౌదరి సమర్థించుకున్నారు. అయితే, దేశ రాజధానిని ఇలా స్తంభింపజేయడం, హోటల్ బుకింగ్‌లు రద్దు కావడం వల్ల పర్యాటకం, వ్యాపారాలు దెబ్బతిని ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News