US Raod Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నగరంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. ఐఎస్‌సదన్ డివిజన్ వాణీనగర్‌లో నివాసముంటున్న వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ అధికారి షేక్ అబ్దుల్ సయీద్ కుమారుడు షేక్ అబ్దుల్ నవీద్ (48) కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డాడు.
పదేళ్ల క్రితమే ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి శాన్‌ఫ్రాన్సిస్‌కో వెళ్లాడు. అక్కడి మెక్ ఫార్మా కంపెనీలో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య నజియా సల్మా (45), కుమార్తె నేహా నహీన్ షేక్ (19), కుమారుడు హఫీజ్ ఉమర్ షేక్ (14), మరో కుమార్తె ఖతీజా షేక్ (8) ఉన్నారు. కాగా నవీద్ కుటుంబంతో కలిసి కారులో తాను నివసిస్తున్న ప్రాంతం నుంచి కారులో నవేడా అనే ప్రాంతానికి విహార యాత్ర (ఫ్యామిలీ టూర్)కు బయలుదేరారు. అయితే భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నజియా సల్మా, నేహా నహీన్ షేక్, హఫీజ్ ఉమర్ షేక్ అక్కడికక్కడే మృతి చెందారు.
Also Read: Karimnagar: కరీంనగర్‌లో భారీ చోరీ.. 66 తులాల బంగారం, రూ. 21 లక్షల నగదు
తీవ్ర గాయాలకు గురైన షేక్ అబ్దుల్ నవీద్, ఖతీజా షేక్‌లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్‌లు వాణీనగర్‌కు చేరుకుని నవీద్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే తనకు, తన భార్య నజీమున్నీసా, సోదరుడు షేక్ అబ్దుల్ జావీద్‌లకు అమెరికా వీసాలు ఇప్పించాలని నవీద్ తండ్రి షేక్ అబ్దుల్ సయీద్ అభ్యర్థించారు.

