ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్(TikTok) సేవలు మరో దేశంలో నిలిచిపోయాయి. ఇప్పటికే అనేక దేశాల్లో సేవలు నిలిచిపోగా.. తాజాగా అగ్రరాజ్యం అమెరికా(America)లో తన సేవలను నిలిపివేస్తున్నట్లు టిక్‌టాక్ ప్రకటించింది. ఈమేరకు ఆండ్రాయిడ్, ఐఓఎస్(IOS) యూజర్లకు సందేశాల ద్వారా తెలియజేస్తోంది. జనవరి 19 నుండి టిక్‌టాక్‌పై నిషేధం అమల్లోకి రానుండటంతో మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా 2017లో ప్రారంభమైన టిక్‌టాక్‌ను భారత్ సహా అనేక దేశాలు నిషేధించిన సంగతి తెలిసిందే. అలాగే అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కూడా దీని వినియోగంపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ చైనా యాజమాన్యాన్ని వదలుకోకపోతే నిషేధం ఎదుర్కోవాలని ఓ బిల్లు తీసుకొచ్చింది. అనంతరం అమెరికా సుప్రీంకోర్టు కూడా జనవరి 19లోగా యూఎస్ యాజమాన్యానికి టిక్‌టాక్‌ను విక్రయిస్తారా? లేదా నిషేధాన్ని ఎదుర్కొంటారా? అని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ను హెచ్చరించింది. అయితే చైనా యాజామాన్యాన్ని వదులుకోవటం ఇష్టం లేని ఆ సంస్థ అమెరికాలో తన సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.