Congo boat accident: కాంగో నదిలో రెండు రోజుల వ్యవధిలో రెండు చోట్ల జరిగిన పడవ ప్రమాదాలు పెను విషాదాన్ని నింపాయి. ఈ ఘోర దుర్ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గల్లంతయ్యారు. వాయవ్య కాంగోలోని ఈక్వెటార్ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న ఈ ప్రమాదాలు కకావికలం చేశాయి.
కాంగో నదిలో ఘోర పడవ ప్రమాదాలు: వందలాది మంది మృతి
గురువారం రాత్రి లుకొలీలా ప్రాంతంలో సుమారు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. మంటలు అదుపు తప్పడంతో పడవ బోల్తా పడి 107 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 209 మందిని సురక్షితంగా రక్షించినట్లు మానవతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సంఘటనకు ఒక రోజు ముందు, బుధవారం బసంకుసు ప్రాంతంలో మరో మోటరైజ్డ్ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మరణించిన 86 మందిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని ప్రభుత్వ మీడియా వెల్లడించింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రమాదాల వల్ల మొత్తం 193 మంది మరణించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమా?
సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, భద్రతా ప్రమాణాలను విస్మరించడం వంటి కారణాల వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాంగోలో రోడ్డు మార్గాలు సరిగా లేకపోవడంతో ప్రజలు చౌకగా ఉండే పడవ ప్రయాణాలపై ఆధారపడుతున్నారు. కానీ, లైఫ్ జాకెట్లు వంటి ప్రాథమిక భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, రాత్రి వేళల్లో ప్రయాణించడం, అధిక బరువు వంటి కారణాల వల్ల తరచూ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని స్థానిక పౌర సమాజ సంస్థ ఆరోపించింది. అయితే, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని వారు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ దుర్ఘటనలు అక్కడి ప్రజల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.


