Trump On Nuclear Tests: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు అణు పరీక్షలను పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. తాము పరీక్షలు చేయబోతున్నారు. ఇతర దేశాలు చేస్తే.. తామూ చేస్తామని.. కానీ వివరాలు ఇప్పుడే చెప్పబోమన్నారు. ఈ ప్రకటన ఆయన ఈ వారం ప్రారంభంలో పెంటగాన్‌కు అణు పరీక్షలను పునఃప్రారంభించమని ఆదేశించిన తర్వాత వచ్చింది. అండర్ గ్రౌండ్ అణు పరీక్షణలు చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ట్రంప్ అవి ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగతాయో త్వరలోనే చెబుతా అంటూ దాటవేశారు.
ట్రంప్ పెంటగాన్‌ను చైనా, రష్యా లకు సమానంగా అమెరికా కూడా పరీక్షలు చేయాలని సూచించారు. తన “ట్రూత్ సోషల్” ఖాతాలో ఆయన “అమెరికాకు ఇతర దేశాల కంటే ఎక్కువ అణు ఆయుధసంపత్తి కలిగి ఉంది. నా మొదటి పదవీకాలంలోనే ఈ శక్తి పెరిగింది. దానిని చేయడం నాకిష్ఠం లేకపోయినా, పరిస్థితులు అనివార్యం చేశాయి” అంటూ రాసుకొచ్చారు.
ట్రంప్ తాజా ప్రకటన ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో దక్షిణ కొరియాలో జరగబోయే వాణిజ్య చర్చల ముందు రావడం గమనార్హం. ప్రస్తుతం ఉత్తర కొరియా మాత్రమే 1990ల తర్వాత పూర్తి స్థాయి అణు పరీక్షలు నిర్వహించిన దేశం. రష్యా అణ్వాయుధాలకు సరిపడే క్షిపణి పరీక్షలు చేసే ప్రయత్నం చేసినా, నేరుగా అణు పేలుళ్లు జరపలేదు. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ ఈ వారం కూడా క్షిపణి పరీక్షలు నిర్వహించాడు.
1945 నుండి 1992 వరకు అమెరికా ఏకంగా 1,054 అణు పరీక్షలు నిర్వహించింది. వీటిలో ఎక్కువ భాగం నెవాడాలో జరిగాయి. పర్యావరణ ఆందోళనలతో పాటు కోల్డ్ వార్ ఉద్రిక్తతలు తగ్గిపోవడంతో అమెరికా పరీక్షలను ఆపింది. 1950లలో భూస్థాయి మీద జరిపిన అణు పరీక్షలు సోవియట్ యూనియన్‌తో ఉద్రిక్తతలు పెంచాయి. 1958లో అప్పటి అధ్యక్షుడు ఐజెన్‌హవర్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ రష్యా ఇటీవల చేసిన పరీక్షలతో మరోసారి అమెరికా రష్యా మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యిందని నిపుణులు చెబుతున్నారు.
1961లో సోవియట్ యూనియన్ మళ్లీ పరీక్షలు ప్రారంభించినప్పుడు అమెరికా కూడా అదే దారిలో కొనసాగింది. కానీ.. 1963లో అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, సోవియట్ యూనియన్ కలిసి “భాగస్వామ్య అణు పరీక్షల నిషేధ ఒప్పందం”పై సంతకం చేశాయి. 1974లో “థ్రెషోల్డ్ టెస్ట్ బాన్ ట్రీటీ” ప్రకారం భూగర్భ పరీక్షల శక్తిని 150 కిలోటన్నుల లోపుగా పరిమితం చేశారు. 1992లో అమెరికా కాంగ్రెస్ మరో దేశం తిరిగి అణు పరీక్షలు జరపకపోతే అమెరికా కూడా ఆపాలని నిర్ణయం తీసుకుంది. తరువాత 1997లో అధ్యక్షుడు బిల్ క్లింటన్ “పూర్తి అణు పరీక్షల నిషేధ ఒప్పందం”పై సంతకం చేశారు. కానీ అప్పట్లో యూఎస్ సెనెట్ దాన్ని ఆమోదించలేదు. ప్రస్తుతం ఆ ఒప్పందంపై 187 దేశాలు సంతకం చేశాయి. అందులో 178 దేశాలు దాన్ని ప్రశంసిస్తూ అమలు చేస్తున్నాయి.


