India opposes US on Bagram Air Base : అగ్రరాజ్యానికే షాక్! అఫ్గానిస్థాన్‌లోని అత్యంత కీలకమైన బాగ్రామ్ వైమానిక స్థావరంపై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత్ ఊహించని ఝలక్ ఇచ్చింది. ఇప్పటిదాకా ఈ విషయంలో అమెరికాను వ్యతిరేకిస్తున్న చైనా, రష్యా, పాకిస్థాన్ సరసన ఇప్పుడు భారత్ కూడా చేరడం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు బాగ్రామ్ స్థావరాన్ని ట్రంప్ ఎందుకు కోరుకుంటున్నారు…? భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది…? ఈ కొత్త కూటమి వెనుక ఉన్న వ్యూహాలేంటి..?
అఫ్గానిస్థాన్‌లోని వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాలిబన్లు, చైనా, రష్యా, పాకిస్థాన్ వంటి దేశాలు ఇప్పటికే ట్రంప్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుండగా, తాజాగా భారత్ కూడా వారి సరసన చేరింది. తాలిబన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల మాస్కోలో జరిగిన “మాస్కో ఫార్మట్” సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరింది.
మాస్కో వేదికగా వ్యతిరేక గళం: అఫ్గానిస్థాన్‌పై జరిగిన ఏడవ ‘మాస్కో ఫార్మట్’ సంప్రదింపుల సమావేశానికి భారత్, రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాన్, మధ్య ఆసియా దేశాల ప్రత్యేక ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలోనే అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, బయటి శక్తుల జోక్యాన్ని అంగీకరించేది లేదని అన్ని దేశాలు ముక్తకంఠంతో తీర్మానించాయి.
‘బాగ్రామ్ కావాల్సిందే’.. ట్రంప్ హెచ్చరికలు: గత నెలలో యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్, “మేము బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తాలిబన్లకు ఉచితంగా వదిలేశాం. ఇప్పుడు అది మాకు తిరిగి కావాలి,” అని స్పష్టం చేశారు. ఆ తర్వాత రెండు రోజులకే తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో, “బాగ్రామ్‌ను తిరిగి ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలుంటాయి,” అంటూ తాలిబన్లను హెచ్చరించారు. అయితే, ఈ హెచ్చరికలను తాలిబన్లు తోసిపుచ్చారు. “ఎట్టి పరిస్థితుల్లోనూ మా భూభాగాన్ని విదేశీ శక్తులకు అప్పగించే ప్రసక్తే లేదు,” అని తాలిబన్ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తేల్చిచెప్పారు.
అగ్రరాజ్యానికి భారత్ ఎందుకు ఎదురుతిరిగింది: ఇటీవల భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించడంపై ఇప్పటికే దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే, దౌత్యపరంగా ట్రంప్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం అఫ్గానిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
బాగ్రామ్ చరిత్ర.. వ్యూహాత్మక ప్రాముఖ్యత: కాబుల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వైమానిక స్థావరాన్ని 1950లలో సోవియట్ యూనియన్ నిర్మించింది. 1979-89 సోవియట్-అఫ్గాన్ యుద్ధంలో ఇది సోవియట్ దళాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. 2001లో తాలిబన్ల పాలనను కూల్చివేసిన తర్వాత, అమెరికా, నాటో దళాలు దాదాపు 20 ఏళ్ల పాటు ఇక్కడి నుంచే తమ కార్యకలాపాలను కొనసాగించాయి. 2020లో తాలిబన్లతో కుదిరిన ఒప్పందం మేరకు అమెరికా దళాలు వైదొలగడంతో, 2021లో ఇది పూర్తిగా తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లింది.
చైనా కోణం.. అమెరికా ఆందోళన: బాగ్రామ్ స్థావరం చైనాలోని కీలక అణు ఆయుధ కేంద్రానికి కేవలం గంట ప్రయాణ దూరంలో ఉందని, అలాంటి కీలక స్థావరాన్ని బైడెన్ ప్రభుత్వం వదులుకుందని ట్రంప్ గతంలో ఆరోపించారు. చైనా ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌కు రోడ్డు మార్గాన్ని నిర్మిస్తుండటం అమెరికా ఆందోళనను మరింత పెంచుతోంది. అయితే, తమ గడ్డపై చైనా సైనికులు ఎవరూ లేరని, వారితో తమకు ఎలాంటి సైనిక సంబంధాలు లేవని తాలిబన్లు స్పష్టం చేశారు.


