Trump blames Hamas : గాజాలో శాంతి ప్రయత్నాలకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాల్పుల విరమణ చర్చలు విఫలం కావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతికి హమాసే అడ్డుగోడగా నిలిచిందని మండిపడుతూ, వారిని పూర్తిగా తుదముట్టించాలని ఇజ్రాయెల్‌కు బహిరంగంగా పిలుపునిచ్చారు. కొద్ది వారాల క్రితం శాంతి ఒప్పందంపై ఎంతో నమ్మకం వెలిబుచ్చిన ఆయనే, ఇప్పుడు స్వరం మార్చడం వెనుక ఆంతర్యమేంటి..? చర్చలు నిజంగానే విఫలమయ్యాయా, లేక ఇది కేవలం తాత్కాలిక ప్రతిష్టంభన మాత్రమేనా..? ట్రంప్ వ్యాఖ్యలు ఈ సంక్లిష్ట వివాదంపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి?
హమాస్‌పై ట్రంప్ నిప్పులు : స్కాట్లాండ్ పర్యటనకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, హమాస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “హమాస్‌కు శాంతి ఒప్పందం చేసుకోవాలనే ఆలోచనే లేదు. వాళ్లకు చావడమే ధ్యేయంగా కనిపిస్తోంది. అది అత్యంత బాధాకరం,” అని ఆయన వ్యాఖ్యానించారు. హమాస్ చావును కోరుకుంటోందని, ఇప్పుడు వారిని అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. గాజాలో ఈ తుది పనిని ఇజ్రాయెల్ పూర్తిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ తన సైనిక చర్యను ఉధృతం చేయడాన్ని ఆయన గట్టిగా సమర్థించారు.
మారిన స్వరం.. విఫలమైన చర్చలు : కొద్ది వారాల క్రితం ఒక ఒప్పందం కుదిరి, బందీలు విడుదలవుతారని, గాజాకు మానవతా సాయం అందుతుందని ట్రంప్ ఎంతో విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, ఆయన మాటల్లో ఇప్పుడు మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. హమాస్‌తో చర్చలు జరిపేందుకు దోహా వెళ్లిన అమెరికా ప్రతినిధి బృందాన్ని వెనక్కి పిలిపించిన ఒకరోజు తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హమాస్ వద్ద సమన్వయం లోపించిందని, వారు సద్భావనతో చర్చలు జరపడం లేదని అమెరికా దూత స్టీవ్ విట్‌కాఫ్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తాను జరిపిన సంభాషణలు కూడా నిరాశపరిచాయని, అయినప్పటికీ వారు పోరాటం కొనసాగించి హమాస్‌ను వదిలించుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ నొక్కి చెప్పారు.
మధ్యవర్తుల భిన్న వాదన : ట్రంప్ చర్చలు పూర్తిగా విఫలమయ్యాయని చెబుతుంటే, మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్ట్, కతార్ దేశాలు మాత్రం పరిస్థితిని భిన్నంగా చూస్తున్నాయి. ఇటువంటి సుదీర్ఘ చర్చల్లో అడ్డంకులు, ప్రతిష్టంభనలు సహజమని, దీనిని తుది వైఫల్యంగా పరిగణించలేమని ఆ దేశాలు అంటున్నాయి. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి కూడా చెప్పడం విశేషం. “చర్చలు పూర్తిగా విఫలమైన దశకు ఇంకా చేరుకోలేదు. అవి కొనసాగే అవకాశాలున్నాయి,” అని ఆయన వెల్లడించారు.
బంధీల వ్యవహారమే కారణమా : హమాస్ చర్చలకు ఆసక్తి చూపకపోవడానికి బందీల వ్యవహారమే కారణమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వారి వద్ద ఉన్న బందీల సంఖ్య చాలా తక్కువని, వారందరినీ విడుదల చేశాక తమ పరిస్థితి ఏమవుతుందోనన్న భయంతోనే హమాస్ ఒప్పందానికి ముందుకు రావడం లేదని ఆయన విశ్లేషించారు. ఇక గాజాకు అమెరికా చేస్తున్న సాయంపై మాట్లాడుతూ, తాము ఆహారం, ఇతర సామాగ్రి కోసం 60 మిలియన్ డాలర్లు అందించామని, ఆ మొత్తం బాధితులకు చేరుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.


