Russia Ukraine War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీతో సమావేశమై రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని తక్షణమే ముగించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌లో అక్టోబర్ 17, 2025న జరిగింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య రెండు అంశాలపై చర్చలు జరిగాయి. యుద్ధ విరమణ, అమెరికా నుంచి ఉక్రెయిన్ కోరిన టోమహాక్ క్షిపణుల సరఫరా గురించి జరిగాయి.
ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా సమావేశమయ్యే ముందు.. ఇరుదేశాలు ఇప్పుడున్న చోటే ఆగిపోవాలి అంటూ యుద్ధాన్ని నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు చాలానే రక్తపాతం జరిగిందని, ఇరుపక్షాలు ఈ విషయంలో ముందుకు రావాలని ట్రంప్ తన ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఇదే క్రమంలో మరోసారి ఇండియా పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు క్లెయిమ్ చేశాడు ట్రంప్.
జెలెన్‌స్కీ ఈ సమావేశాన్ని “ప్రొడక్టివ్”గా పేర్కొంటూ.. ట్రంప్ యుద్ధం ముగించాలనే ఉద్దేశ్యాన్ని విశ్వసిస్తున్నామని తెలిపారు. ఆయన ఇంకా ఉక్రెయిన్ టోమహాక్ క్షిపణుల అవసరాన్ని వివరించారు. కానీ వాటి విక్రయంపై ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. జెలెన్‌స్కీ శాంతి కోసం రష్యాతో “ద్వైపాక్షిక లేదా త్రైపాక్షిక” చర్చలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ మాత్రమే యుద్ధాన్ని ఆపగలరని కూడా చెప్పారు.
యుద్ధభూమిపై సరిహద్దులు యుద్ధం ద్వారా కాకుండా చరిత్ర ద్వారా నిర్ణయించబడుతాయని పేర్కొన్నారు ట్రంప్. ఆయన ఉద్దేశ్యం అమెరికాను యుద్ధ సరఫరాదారు కాకుండా.. శాంతి సాధించే “మధ్యవర్తి”గా నిలపటమని సూచించారు. ట్రంప్, ఉక్రెయిన్ కోరిన దీర్ఘశ్రేణి ఆయుధాల సరఫరా రష్యాతో ఉద్రిక్తతలను పెంచవచ్చని హెచ్చరిస్తూ, ఆ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేయనున్నట్లు తెలిపారు.అయితే ఈ సమావేశానికి వారం ముందే ట్రంప్ పుతిన్ తో ఫోన్ ద్వారా మాట్లాడి శాంతి దిశగా అడుగుల వేయటం గురించి చర్చించారు. మధ్యప్రాచ్యంలోని గాజా విరమణ ఒప్పందం విజయవంతమైన తర్వాత ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ముగించడంపైనే దృష్టి సారించినట్లు వైట్‌హౌస్ వర్గాలు చెబుతున్నాయి. స్థిరమైన శాంతి కోసం రష్యా పాత్ర కీలకమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


