Trump 200% Tariffs: చాలా కాలంగా తానొక ప్రపంచ శాంతి దూతగా ట్రంప్ తనను తాను అభివర్ణించుకుంటున్నారు. 7 యుద్ధాలు ఆపానని, తాను లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం మెుదలయ్యేదని ట్రంప్ తన డప్పు తానే కొట్టుకున్నాడు. ఇంతటితో ఆగని ట్రంప్ తనను నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని మారాం చేశారు. కానీ ఇవన్నీ ఫలించలేదు. ఈ క్రమంలోనే మరోసారి తానే ఇండియా పాక్ మధ్య యుద్ధాన్ని నివారించానని.. తాను భారీ సుంకాలు విధిస్తానని బెదిరించాకే రెండు దేశాలు యుద్ధాన్ని విరమించాయని చెప్పారు.
తాను సుంకాలను తెలివిగా వినియోగించకపోతే రెండు దేశాలు ఇప్పటికీ యుద్ధంలోనే ఉండేవంటూ అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన భారత్, పాక్ యుద్ధంలో జరిగిన ప్రక్రియకు పూర్తి విరుద్ధంగా ఉంది. గతంలోనే అనేక సందర్భాల్లో ట్రంప్ యుద్ధాన్ని ఆపానంటూ చేసిన క్లెయిమ్ లను భారత్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా తాను నోబెల్ బహుమతి కోసం చేయలేదని.. ప్రపంచ శాంతికోసమే చేశానంటూ ట్రంప్ చెప్పుకుంటున్నారు.
తాను కొన్ని యుద్ధాలను సుంకాల ఆధారంగానే పరిష్కరించుకున్నానని ట్రంప్ చెప్పారు. ఉదాహరణకు, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం చేయాలనుకుంటే .. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నందున ఇద్దరిపైనా 100 శాతం, 150 శాతం లేదా 200 శాతం వంటి పెద్ద సుంకాలను విధిస్తానని గట్టిగా చెప్పినట్లు ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత 24 గంటల్లోనో సమస్య పరిష్కారం అయ్యిందని.. దీనంతటికీ కారణం తన వద్ద ఉన్న సుంకాలు అనే ఆయుధమేనని ప్రెసిడెంట్ అన్నారు.
మే నెలలో ఇండియా పాక్ మధ్య జరిగిన సంఘర్షణకు తానే మధ్యవర్తిత్వం వహించినట్లు ట్రంప్ క్రెడిట్ తీసుకుంటున్నారు. తాను జోక్యం చేసుకోకపోతే మ్యాటర్ వేరేలా ఉండేదన్నారు. తనవల్లే చాలా యుద్ధాలు ఆగి కేవలం 24 గంటల్లోనే పీస్ డీల్స్ జరుగుతున్నాయని ట్రంప్ వాదన. ఇదే విషయాన్ని ఆయన కుదిరినప్పుడల్లా చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవటం కొంత ప్రపంచ నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఇటీవల హమాస్, ఇజ్రాయెల్ మధ్య పీస్ డీల్ కోసం ట్రంప్ ఇచ్చిన అల్టిమేటం వల్ల ఉగ్రవాదులు అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే.


