Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Donald Trump : మోదీతో మంతనాలు.. పాక్‌కు పెను హెచ్చరికలు.. అణుయుద్ధం ఆపింది నేనే!

Donald Trump : మోదీతో మంతనాలు.. పాక్‌కు పెను హెచ్చరికలు.. అణుయుద్ధం ఆపింది నేనే!

Donald Trump India Pakistan relations : భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల విషయంలో అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అదే పాత పాట అందుకున్నారు. ఇరు దేశాల మధ్య అణుయుద్ధం ముంగిట నిలిస్తే, తానే దాన్ని అడ్డుకున్నానని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడటమే కాకుండా, పాకిస్థాన్‌కు వాణిజ్యపరంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశానని ఆయన పునరుద్ఘాటించారు. వైట్‌హౌస్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి దుమారం రేపాయి. 

ట్రంప్ మాటల్లోనే : వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రస్తావన తెచ్చారు. “నేను భారత్‌కు చెందిన అద్భుతమైన వ్యక్తి, ప్రధాని మోదీతో మాట్లాడాను. పాకిస్థాన్‌తో మీకేంటి సమస్య? అని అడిగాను. ఆ తర్వాత పాకిస్థాన్‌తో మాట్లాడి అదే ప్రశ్న వేశాను,” అని ట్రంప్ తెలిపారు. “ఈ గొడవ శతాబ్దాలుగా వేర్వేరు పేర్లతో కొనసాగుతూనే ఉంది. అయితే నేను పాకిస్థాన్‌తో చాలా స్పష్టంగా చెప్పాను. మీరు దీన్ని అణు యుద్ధంతో ముగించాలనుకుంటున్నారు, కానీ మేం మీతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోం. మీపై మీ తల తిరిగేంత భారీ సుంకాలు విధిస్తాం. యుద్ధం జరగడానికి వీల్లేదు అని చెప్పిన ఐదు గంటల్లోనే సమస్య సద్దుమణిగింది,” అంటూ ట్రంప్ తన ఘనతను తానే కీర్తించుకున్నారు.

- Advertisement -

విమానాల కూల్చివేతపై గందరగోళం: సంఘర్షణ సమయంలో ఏడు యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ మరోసారి తన వాదనను వినిపించారు. “వారు పోరాడుకోవడం నేను చూశాను. ఏడు విమానాలు నేలకూలాయని తెలిసింది. ఇది మంచిది కాదు. దాదాపు 150 మిలియన్ డాలర్ల విలువైన విమానాలు అవి. బహుశా ఏడు కంటే ఎక్కువే ఉండొచ్చు,” అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఇదే విషయంపై మాట్లాడుతూ ఐదు విమానాలు కూలిపోయాయని చెప్పిన ట్రంప్, ఇప్పుడు ఆ సంఖ్యను ఏడుకు పెంచడం గమనార్హం. వాణిజ్యం అనే ఆయుధాన్ని ఉపయోగించే తాను పరిస్థితిని అదుపులోకి తెచ్చానని ఆయన నొక్కి చెప్పారు.

భారత్ వాదన ఇందుకు పూర్తి భిన్నం: ట్రంప్ చేస్తున్న వాదనలకు భారత ప్రభుత్వం మొదటి నుంచి పూర్తి భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్”ను ఆపమని ఏ దేశ నాయకుడు కూడా తమను కోరలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పార్లమెంటు వేదికగా స్పష్టం చేశారు. ఈ విషయంలో మూడో పక్షం జోక్యమే లేదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కూడా కుండబద్దలు కొట్టారు. ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితంగానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ అధికారికంగా ప్రకటించింది.

భారత్ తమది ద్వైపాక్షిక సమస్య అని, మూడో వ్యక్తి ప్రమేయాన్ని సహించేది లేదని అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపిస్తున్నప్పటికీ, డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన మధ్యవర్తిత్వంతోనే అణుయుద్ధం ఆగిపోయిందని పదేపదే చెప్పుకుంటున్నారు. తన వాణిజ్య దౌత్య నీతికి ఇదొక విజయంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, భారత ప్రభుత్వం స్థిరమైన, స్పష్టమైన వైఖరి ముందు ట్రంప్ వ్యాఖ్యలు కేవలం స్వీయ ప్రశంసలుగానే మిగిలిపోతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad