Donald Trump On India-Russia Trade: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. భారత్, రష్యా మధ్య వాణిజ్య సంబంధాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్-రష్యా వాణిజ్య సంబంధాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే, ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ట్రూత్ సోషల్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు:
రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నప్పటికీ, నాకు అస్సలు సంబంధం లేదని ట్రంప్ పేర్కొన్నారు. భారత్, రష్యాలు కలిసి తమ నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థలను మరింతగా కూల్చివేసుకోవచ్చు,” అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. భారత్‌తో అమెరికా చాలా తక్కువ వ్యాపారం చేస్తుందని, దానికి కారణం అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న అధిక సుంకాలని ఆయన ఆరోపించారు. “చెప్పాలంటే, ప్రపంచంలోనే అమెరికా వస్తువులపై అత్యధిక టారిఫ్‌లు విధించే దేశం ఇండియా,” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
ALSO READ: https://teluguprabha.net/international-news/india-philippines-bolster-defence-maritime-cooperation/
సుంకాల పెంపు వెనుక అసలు కారణం ఇదే:
రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడమే భారత్‌పై కొత్తగా 25 శాతం సుంకాలు విధించడానికి ప్రధాన కారణమని ట్రంప్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో రష్యా దాడులతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుంటే, ఆ మరణాలను ఆపడానికి ప్రపంచం ప్రయత్నిస్తుంటే, భారత్ మాత్రం రష్యా నుంచి సైనిక ఉత్పత్తులతో సహా భారీగా కొనుగోళ్లు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
“అమెరికాకు భారత్ చాలా ఏళ్లుగా మిత్రదేశం. అయినా వారు విధిస్తున్న అధిక సుంకాల వల్ల మేం వారితో తక్కువ వ్యాపారం చేశాం.
ALSO READ: https://teluguprabha.net/international-news/trump-pakistan-oil-deal-india-tariffs/
“భారత్, రష్యా నుంచి అధిక సైనిక కొనుగోళ్లు జరుపుతోంది. ఇది మాకు ఆమోదయోగ్యం కాదు. పర్యవసానంగా, భారతీయ వస్తువులపై 25% దిగుమతి సుంకం విధించబడుతుంది. రష్యాతో నిరంతర వాణిజ్య సంబంధాలకు ఇది జరిమానాగా పరిగణించబడుతుంది,” అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు.
కుంగిపోయిన ఆర్థిక వ్యవస్థలంటూ అవహేళన:
భారత్, రష్యాల ఆర్థిక వ్యవస్థలను ‘డెడ్ ఎకానమీలు’గా ట్రంప్ అభివర్ణించడం తీవ్ర దుమారం రేపుతోంది. రష్యా వంటి శత్రు శక్తితో భారత్ వ్యాపారం చేస్తోందని ఆరోపించడమే కాకుండా, రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌పైనా ఆయన విమర్శలు గుప్పించారు. వాషింగ్టన్‌తో ఆటలు వద్దని, అవి యుద్ధానికి దారితీయవచ్చని మెద్వెదేవ్ చేసిన హెచ్చరికలకు కౌంటర్‌గా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.


