US China Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన తాజా చర్చలు గ్లోబల్ దృష్టిని ఆకర్షించాయి. గురువారం దక్షిణ కొరియా నగరం బుసాన్‌లో జరిగిన ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సదస్సు సందర్భంగా ఇద్దరు నాయకులు ముఖాముఖీగా సమావేశమయ్యారు. 2019 తర్వాత ఇది వారి మొదటి ప్రత్యక్ష భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ట్రంప్ ఈ సమావేశాన్ని “అద్భుతమైనది”గా వర్ణిస్తూ.. చైనాతో సంబంధాలను మరింత స్థిరంగా ఉంచాలని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో fentanylపై గతంలో విధించిన 20 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోకి ప్రాణాంతక మత్తు పదార్థాల ప్రవాహం నిలిపివేయడానికి అధ్యక్షుడు షీ కష్టపడతారని తనకు నమ్మకం ఉందంటూ కామెంట్ చేశారు. అలాగే ఇద్దరు నాయకులు చైనాతో అమెరికా మధ్య ఉన్న వాణిజ్య తగాదాలు “తీర్చుకున్నామని” ట్రంప్ ప్రకటించారు.
కొన్ని నెలలుగా కొనసాగుతున్న అరుదైన ఖనిజాల సరఫరాపై వివాదానికి నాయకులు ఫుల్ స్టాప్ పెట్టారు. ఒకసారి పొడిగించుకునే విధంగా ఒక ఏడాదికి ఒప్పందం కుదిరిందని ట్రంప్ వెల్లడించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ యుద్ధంపై కూడా ఇద్దరు నేతలు విస్తారంగా చర్చించారు. షీ జిన్‌పింగ్‌తో కలిసి అమెరికా ఉక్రెయిన్‌లో శాంతి సాధన దిశగా పనిచేస్తుందని ట్రంప్ వెల్లడించారు.
ట్రంప్ తన చైనా పర్యటనను 2026 ఏప్రిల్‌లో జరపనున్నట్లు ప్రకటించారు. తైవాన్ అంశం ఈ భేటీలో చర్చకు రాలేదని ఆయన స్పష్టంచేశారు. అలాగే చైనాపై అమలులో ఉన్న 57 శాతం సుంకాలను ట్రంప్ ప్రస్తుతం 47 శాతానికి తగ్గించారు. దీంతో ఇటీవల ట్రంప్ చైనా రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరా నిలుపుదలతో 100 శాతం సుంకాలు ఉంటాయని ట్రంప్ చేసిన బెదిరింపుకు అడ్డుకట్ట పడింది. రానున్న కాలంలో ఖనిజాల సరఫరాలో చైనా నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని ట్రంప్ విలేఖరులతో మాట్లాడుతూ వెల్లడించారు.


