Trump Declares 100% Tariff on Pharma Imports: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన “అమెరికా ఫస్ట్” విధానాన్ని చాటుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1, 2025 నుంచి విదేశాల నుంచి దిగుమతి అయ్యే బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధాలపై 100% సుంకం (టారిఫ్) విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే, అమెరికాకు అతిపెద్ద ఔషధ ఎగుమతిదారుగా ఉన్న భారత ఫార్మా రంగంలో ఆందోళనలు మొదలయ్యాయి. భారత స్టాక్ మార్కెట్లలో ఫార్మా షేర్లు కుప్పకూలాయి. అయితే, ఈ నిర్ణయం లోతుగా విశ్లేషిస్తే భారత జెనరిక్ ఫార్మా కంపెనీలకు తక్షణ ముప్పేమీ లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ALSO READ: H1B Fee Exemption:వాళ్లు మాత్రం హెచ్1బి వీసాకు లక్ష డాలర్లు కట్టక్కర్లేదు.. ట్రంప్ రిలీఫ్..
ట్రంప్ షరతు ఏంటి?
“అక్టోబర్ 1 నుంచి బ్రాండెడ్ లేదా పేటెంట్ ఉన్న ఫార్మా ఉత్పత్తులపై 100% సుంకం విధిస్తాం. అయితే, అమెరికాలో తమ ఫార్మా తయారీ ప్లాంట్‌ను నిర్మిస్తున్న కంపెనీలకు ఈ సుంకం వర్తించదు” అని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో పేర్కొన్నారు. ‘నిర్మిస్తున్న’ అంటే, ఇప్పటికే పనులు ప్రారంభించి ఉండాలని (breaking ground) లేదా నిర్మాణంలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా అమెరికాలో ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయాలని, దేశీయంగా ఉద్యోగాలు సృష్టించాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
భారత్‌పై ప్రభావం ఎంత?
ఈ వార్త రాగానే భారత్‌కు గట్టి దెబ్బ తగలబోతోందని అందరూ భావించారు. ఎందుకంటే, అమెరికా భారత ఫార్మా ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్. గత ఆర్థిక సంవత్సరంలో (FY24) భారత్ చేసిన $27.9 బిలియన్ల ఫార్మా ఎగుమతుల్లో, దాదాపు 31% ($8.7 బిలియన్లు) అమెరికాకే వెళ్లాయి. అమెరికాలో ఉపయోగించే జెనరిక్ మందుల్లో 45% పైగా భారత్ నుంచే సరఫరా అవుతున్నాయి.
ALSO READ: Muhammad Yunus: “బంగ్లాదేశ్‌కు భారత్‌తో సమస్యలు ఉన్నాయి!”.. యూనస్ సంచలన వ్యాఖ్యలు
అయితే, ట్రంప్ విధించిన సుంకం కేవలం ‘బ్రాండెడ్, పేటెంట్’ ఉన్న మందులకే పరిమితం. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వాటిలో అధిక శాతం ‘జెనరిక్’ ఔషధాలే. ఇవి పేటెంట్ గడువు ముగిసిన తర్వాత తక్కువ ధరకు లభించే మందులు. ఈ కారణంగా ట్రంప్ నిర్ణయం ప్రభావం భారత్‌పై నామమాత్రంగానే ఉంటుందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (IPA) సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ స్పష్టం చేశారు. ఫార్మెక్సిల్ ఛైర్మన్ నమిత్ జోషి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పటికే డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్‌సైన్సెస్, సిప్లా వంటి అనేక పెద్ద భారతీయ ఫార్మా కంపెనీలు అమెరికాలో తమ తయారీ యూనిట్లను కలిగి ఉన్నాయి. కాబట్టి, వాటిపై ఈ సుంకం ప్రభావం దాదాపుగా ఉండదు. అయితే, భవిష్యత్తులో కాంప్లెక్స్ జెనరిక్స్, బయోసిమిలర్స్ వంటి వాటిని కూడా సుంకాల పరిధిలోకి తెస్తారేమోనన్న చిన్నపాటి ఆందోళన మాత్రం పరిశ్రమ వర్గాల్లో ఉంది.
ఈ ప్రకటనతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2.4% పతనమైంది. ఇది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ఇప్పటికే ట్రంప్ 50% టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో వచ్చిన మరో కీలక పరిణామం.
ALSO READ: Trump-Pak PM Meet: ట్రంప్‌తో పాక్ ప్రధాని రహస్య భేటీ.. మీడియాకు నో ఎంట్రీ..!


