Trump Demands Return of Bagram Air Base: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాలిబాన్‌లపై మరోసారి ఒత్తిడి పెంచారు. 2021లో అమెరికా వదిలిపెట్టిన బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి అప్పగించాలని తాలిబాన్‌లను డిమాండ్ చేశారు. దీనిని తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ స్థావరం అమెరికాకు వ్యూహాత్మకంగా ముఖ్యమైనదని అన్నారు. ముఖ్యంగా పశ్చిమ చైనా నుంచి ఎదురయ్యే ముప్పును పర్యవేక్షించడానికి ఈ స్థావరం తమకు కావాలని ట్రంప్ పేర్కొన్నారు. ఇది చైనా అణు స్థావరాల కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి అత్యంత కీలకమని ట్రంప్ భావిస్తున్నారు.
ట్రంప్ హెచ్చరికలపై తాలిబాన్‌ల స్పందన: అఫ్ఘానిస్తాన్‌లో ఒకప్పుడు అమెరికా కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. అఫ్ఘానిస్తాన్ ఆధీనంలో ఉన్న బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి యునైటెడ్ స్టేట్స్‌కు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అయితే.. ట్రంప్ హెచ్చరికను తాలిబాన్ అధికారులు తిరస్కరించారు. బాగ్రామ్ అఫ్ఘానిస్తాన్ భూభాగంలో భాగమని అన్నారు. అది చైనా అవుట్‌పోస్ట్ కాదని తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు.
Also Read:https://teluguprabha.net/international-news/trump-imposes-100k-annual-fee-on-h-1b-visas/
బాగ్రామ్ విషయంలో ట్రంప్ ఒత్తిడికి గల కారణాలు: ఒకప్పుడు అమెరికాకు చెందిన 40,000 మంది సైనికులు, పౌర కాంట్రాక్టర్లతో బాగ్రామ్ వైమానిక స్థావరం నిండి ఉండేది. అయితే అమెరికా సైన్యం 2021 జులైలో హఠాత్తుగా బాగ్రమ్‌ను ఖాళీ చేసింది. ఆ తర్వాత అది తాలిబాన్ల వశమైంది. బాగ్రామ్‌కు దగ్గరలోనే చైనాలోని కష్ఘర్ ప్రాంతంలో ఒక అణు స్థావరం ఉన్నట్లు నిపుణులు అంచనా. ఈ నేపథ్యంలోనే చైనాపై నిఘా పెట్టేందుకు ట్రంప్ బాగ్రామ్‌ను తిరిగి కోరుకుంటున్నారు.
సందేహాలు వ్యక్తం చేస్తున్న అమెరికా ఉన్నతాధికారులు: అమెరికాలోని కొందరు ఉన్నతాధికారులు మాత్రం ఈ ఆలోచనపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బాగ్రామ్‌ను ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా వంటి ఉగ్ర సంస్థల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడం చాలా కష్టమని అంటున్నారు. దీనికి వందల సంఖ్యలో సైనికులు అవసరమని అంచనా వేస్తున్నారు. భారీగా నిధులు అవసరమని ఒక ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. ట్రంప్ ప్రణాళికలు ప్రస్తుతానికి సాధ్యం కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.


