Trump Vs Iran: ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. ఇరాన్‌పై ఒత్తిడిని పెంచుతూ.. ఆ దేశం వైపు ఒక భారీ నౌకాదళాన్ని పంపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేసింది. ఇరాన్‌లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న నిరసనలు, అణచివేత చర్యల నేపథ్యంలో అమెరికా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దావోస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ దిశగా యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు బయలుదేరాయని చెప్పారు. తాము ఒక పెద్ద ఫ్లోటిల్లాను పంపుతున్నామన్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూస్తాం.. సైనిక చర్య మా చివరి ఆప్షన్ మాత్రమే, కానీ వారిని మేము నిశితంగా గమనిస్తున్నాం అంటూ ట్రంప్ హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు.
also read Ram Pothineni: బడ్జెట్ లెక్కలేసుకుంటున్న నిర్మాతలు.. రిస్క్ చేస్తోన్న రామ్
అంతేకాకుండా ఇరాన్‌లో మరణశిక్ష పడిన 837 మంది నిరసనకారులను తన హెచ్చరికల ద్వారా ప్రాణాలతో కాపాడగలిగానని ట్రంప్ క్రెడిట్ తీసుకున్నారు. తాను గురువారం నాడు 837 ఉరిశిక్షలను నిలిపివేయించానని.. లేదంటే వారు ఈపాటికి ప్రాణాలు కోల్పోయి ఉండేవారన్నారు ట్రంప్. ఒకవేళ ఆ శిక్షలు అమలు చేస్తే ఇప్పటివరకు చూడని రీతిలో అమెరికా దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌ను హెచ్చరించానని వెల్లడించారు. అమెరికా ఒత్తిడి కారణంగానే ఉరిశిక్షలకు గంట ముందు ఇరాన్ వెనక్కి తగ్గిందని చెప్పారు.
ప్రస్తుతం ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుంచి యుద్ధ నౌకలు మధ్యప్రాచ్యం వైపు కదులుతున్నాయి. ఇందులో భాగంగా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకతో పాటు విధ్వంసక నౌకలు, యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. మరోవైపు ఇరాన్‌లో ఆర్థిక కష్టాల వల్ల మొదలైన నిరసనల్లో ఇప్పటివరకు 4,500 మందికి పైగా మరణించారని మానవ హక్కుల సంస్థలు చెబుతుండగా.. ఇరాన్ అధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య 5,000 దాటినట్లు సమాచారం. ఈ క్రమంలో అమెరికా సైనిక మోహరింపు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ దేశాలు కూడా ఈ తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. అయితే ఉద్రిక్తతలు చేయి జారకూడదని అందరూ కోరుకుంటున్నారు.

