Donald Trump health diagnosis : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ఆయనకు దీర్ఘకాల సిరల వ్యాధి (Chronic Venous Insufficiency) ఉన్నట్లు వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దీనిపై పడింది. అయితే, ఈ ప్రకటన వెనుక ఆంతర్యమేమిటి..? అధ్యక్షుడి ఆరోగ్యంపై పారదర్శకత ప్రదర్శించడమా లేక వదంతులకు అడ్డుకట్ట వేయడమా..? అసలు ఈ సిరల వ్యాధి అంటే ఏమిటి..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ఊహాగానాలకు తెరదించుతూ వైట్‌హౌస్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆయనకు ‘దీర్ఘకాల సిరల వ్యాధి’ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
వైట్‌హౌస్ ఏమంది : శుక్రవారం మీడియా సమావేశంలో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఈ వివరాలను వెల్లడించారు. “గత కొంతకాలంగా అధ్యక్షుడు ట్రంప్ కాళ్ల కింది భాగంలో, ముఖ్యంగా చీలమండల వద్ద తేలికపాటి వాపును గమనించాం. వైద్య పరీక్షల అనంతరం, దీనిని ‘వీనస్ ఇన్‌సఫీషియెన్సీ’గా వైద్యులు నిర్ధారించారు. ఇది 70 ఏళ్లు దాటిన వారిలో సర్వసాధారణంగా కనిపించే రక్తప్రసరణ సమస్య,” అని ఆమె తెలిపారు.
“ప్రస్తుతం అధ్యక్షుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు, ఆయనకు ఎలాంటి అసౌకర్యం లేదు. డీప్ వీన్ థ్రాంబోసిస్ (రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం) లేదా ఇతర తీవ్రమైన గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలేవీ లేవని పరీక్షల్లో తేలింది. అధ్యక్షుడి ఆరోగ్యం విషయంలో పూర్తి పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాం,” అని లెవిట్ పేర్కొన్నారు. ఇటీవల ట్రంప్ చేతిపై కనిపించిన ఎర్రటి మచ్చలపైనా ఆమె స్పందిస్తూ, అవి తరచుగా కరచాలనం చేయడం, ఆస్పిరిన్ వాడకం వల్ల కలిగే సాధారణ ప్రభావమేనని వివరించారు.
అసలేమిటీ సిరల సమస్య : సాధారణంగా మన శరీరంలోని సిరలు (veins) కాళ్లు ఇతర భాగాల నుంచి రక్తాన్ని తిరిగి గుండెకు చేరవేస్తాయి. ఈ ప్రక్రియకు సిరల్లో ఉండే కవాటాలు (valves) సహాయపడతాయి. ‘వీనస్ ఇన్‌సఫీషియెన్సీ’ ఉన్నవారిలో ఈ కవాటాలు బలహీనపడతాయి. దీనివల్ల రక్తం సక్రమంగా గుండెకు చేరకుండా, వెనక్కి ప్రవహించి కాళ్లలోని సిరల్లోనే నిలిచిపోతుంది. దీని ఫలితంగా కాళ్లలో వాపు, నొప్పి, చర్మం రంగుమారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వయసు పెరగడం, అధిక బరువు, ఎక్కువ సేపు నిలబడటం లేదా కూర్చోవడం వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. ఇది ప్రాణాంతక వ్యాధి కానప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం, జీవనశైలి మార్పులతో దీనిని అదుపులో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.


