Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Donald Trump : పుతిన్ పై కోపం - భారత్ పై ప్రతాపం.. ట్రంప్...

Donald Trump : పుతిన్ పై కోపం – భారత్ పై ప్రతాపం.. ట్రంప్ టారిఫ్‌ల వెనుక వ్యూహం!

Trump’s tough stance on India : నిన్న మొన్నటిదాకా ‘మిత్రమా’ అంటూ స్నేహహస్తం చాచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు భారత్‌పై కస్సుమంటున్నారు. సుంకాల కొరడా ఝుళిపిస్తున్నారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా భారత్‌తో సఖ్యతగా ఉన్నట్లు కనిపించిన ట్రంప్‌కు హఠాత్తుగా ఎందుకింత కోపం వచ్చింది…? రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోయానన్న నిస్పృహ, పుతిన్ తనను పట్టించుకోవడం లేదన్న ఆగ్రహాన్ని భారత్‌పై తీర్చుకుంటున్నారా…? ఈ ఆకస్మిక వైఖరి మార్పు వెనుక దాగి ఉన్న అసలు వ్యూహమేంటి..?

- Advertisement -

యుద్ధాన్ని ఆపలేక : డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక, కేవలం వారం రోజుల్లోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని గొప్పలు చెప్పుకున్నారు. కానీ, వారాలు కాస్తా నెలలుగా మారాయి, యుద్ధం మాత్రం ఆగలేదు. ఇటీవల ఆగస్టు 8వ తేదీని యుద్ధం ఆపడానికి డెడ్‌లైన్‌గా విధించారు. గడువు సమీపిస్తున్నా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ట్రంప్ మాటలను బేఖాతరు చేస్తున్నారు. కనీసం ఒక్కసారి కూడా ట్రంప్ డెడ్‌లైన్‌పై స్పందించలేదు. తన మాటను పుతిన్ పెడచెవిన పెట్టడంతో ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో, నిరాశతో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

పుతిన్‌ దగ్గర పప్పులుడకక : ఒకవైపు పుతిన్ మొండివైఖరి, మరోవైపు ఉక్రెయిన్ విషయంలో తను అనుకున్నది సాధించలేకపోతున్నానన్న ఫ్రస్ట్రేషన్ ట్రంప్‌ను వేధిస్తోంది. 2022 నుంచి ఇప్పటివరకు అమెరికా ఉక్రెయిన్‌కు దాదాపు రూ.15 లక్షల కోట్లకు పైగా సైనిక సహాయం అందించింది. అయినా యుద్ధం ఆగకపోగా, ప్రపంచ శాంతిదూతగా నిలవాలన్న తన కల చెదిరిపోతోందని ట్రంప్ కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. నయానో భయానో మాస్కోను దారికి తెచ్చుకోవాలని చూసినా, పుతిన్ దగ్గర ఆయన పప్పులుడకలేదు. దీనికి తోడు, యుద్ధాన్ని ఇంకా ఆపలేకపోయారంటూ సొంత దేశంలోనే మీడియా నుంచి, రాజకీయ వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

అందుకే భారత్‌పై గురి : ఈ నేపథ్యంలో, పుతిన్‌పై ఉన్న కోపాన్ని, ఉక్రెయిన్ విషయంలో ఉన్న ఫ్రస్ట్రేషన్‌ను ట్రంప్ ఇప్పుడు రష్యాకు అత్యంత ముఖ్యమైన వాణిజ్య మిత్రదేశంగా ఉన్న భారత్‌పై తీర్చుకుంటున్నారని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యాను నేరుగా ఏమీ చేయలేక, ఆ దేశంతో వాణిజ్యం సాగిస్తున్న భారత్‌పై సుంకాల రూపంలో దాడికి దిగుతున్నారు.

దీనికి మరో కారణం కూడా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ముందున్న పరిస్థితుల్లో అమెరికా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ఒకటి. కానీ, యుద్ధం తర్వాత భారత్ తన జాతీయ ప్రయోజనాల రీత్యా రష్యా నుంచి తక్కువ ధరకు లభించే చమురు దిగుమతులను భారీగా పెంచుకుంది. ఖరీదైన అమెరికా చమురును కాదని, రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడమే ట్రంప్ ఆగ్రహానికి తక్షణ కారణంగా కనిపిస్తోంది. మొత్తం మీద, పుతిన్‌పై ప్రతీకారం తీర్చుకోలేక, ఆ కోపాన్ని, నిస్పృహను భారత్‌పై చూపిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad