Trump Imposes 50% Tariffs on India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును నిరసిస్తూ, భారత దిగుమతులపై అదనంగా 25% సుంకాన్ని విధిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. దీంతో, మొత్తం సుంకం 50 శాతానికి చేరుకుంది. ఈ నిర్ణయం భారత పరిశ్రమ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ట్రంప్ ఈ నిర్ణయాన్ని ఓ కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా జారీ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా సహకరిస్తోందని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తోందని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ చర్య వల్ల భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సుంకాల పెంపుతో భారత్‌లోని ఆటోమొబైల్, టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా వంటి కీలక రంగాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరిగి, భారతీయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోవచ్చని ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు.
భారత్‌నే లక్ష్యంగా చేసుకున్న అమెరికా?
భారత్ ఈ నిర్ణయాన్ని “అత్యంత దురదృష్టకరం” అని అభివర్ణించింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని, ఇతర దేశాలు కూడా రష్యాతో వాణిజ్యం చేస్తున్నా, కేవలం భారత్‌నే లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించింది. భారత జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య ఎలాంటి వాణిజ్య, రాజకీయ పరిణామాలకు దారితీస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.


