Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్H-1B visa: H-1B వీసాలపై ట్రంప్ 'సర్జికల్ స్ట్రైక్'.. భారత్ తీవ్ర ఆందోళన

H-1B visa: H-1B వీసాలపై ట్రంప్ ‘సర్జికల్ స్ట్రైక్’.. భారత్ తీవ్ర ఆందోళన

India Warns of “Humanitarian Consequences”: H-1B వీసాల వార్షిక రుసుమును ఏకంగా $100,000 (భారత కరెన్సీలో సుమారు రూ. 88 లక్షలకు పైగా)కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల “మానవతావాద పరిణామాలు” తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతాయని, వారి జీవితాల్లో గందరగోళం ఏర్పడుతుందని పేర్కొంది.

- Advertisement -

“ఈ నిర్ణయం పూర్తి ప్రభావాలపై మేము అధ్యయనం చేస్తున్నాం. భారత పరిశ్రమ వర్గాలు కూడా దీనిపై విశ్లేషణ చేస్తున్నాయి. టెక్నాలజీ, ఆవిష్కరణల రంగంలో ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయంపై అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతామని ఆశిస్తున్నాం,” అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ALSO READ: H1B Visa: భారతీయులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్.. హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుం లక్ష డాలర్లు!

ఐటీ రంగంలో తీవ్ర ప్రకంపనలు

అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయ టెక్ నిపుణులకు, వారిపై ఆధారపడిన ఐటీ కంపెనీలకు ఇది పిడుగులాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలపై మరోసారి తనదైన శైలిలో ఉక్కుపాదం మోపారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన H-1B వీసాల వార్షిక రుసుమును ఏకంగా $100,000 (భారత కరెన్సీలో సుమారు రూ. 88 లక్షలకు పైగా)కు పెంచుతూ ఒక సంచలన ప్రకటనపై సంతకం చేశారు. శుక్రవారం వెలువడిన ఈ నిర్ణయం భారత ఐటీ రంగంలో, ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు కంపెనీల పరిమాణాన్ని బట్టి కేవలం $2,000 నుంచి $5,000 మధ్య ఉన్న ఫీజును ఊహకందని స్థాయికి పెంచడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

ట్రంప్ వాదన ఇదే..

ఈ అనూహ్యమైన పెంపుపై ట్రంప్ తనదైన శైలిలో సమర్థించుకున్నారు. H-1B వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని, తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను తీసుకువచ్చి అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు. “ఈ కార్యక్రమం దుర్వినియోగం కావడం దేశ జాతీయ భద్రతకు కూడా ముప్పుగా మారింది. వీసా మోసాలు, మనీ లాండరింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కొన్ని ఔట్‌సోర్సింగ్ కంపెనీలు పాల్పడుతున్నాయి,” అని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ భారీ ఫీజు పెంపుతో నిజంగా అత్యంత నైపుణ్యం కలిగిన, అమెరికన్లతో భర్తీ చేయలేని ఉద్యోగులు మాత్రమే దేశంలోకి వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. వైట్ హౌస్ సిబ్బంది కార్యదర్శి విల్ షార్ఫ్ కూడా H-1B వీసా వ్యవస్థ అత్యంత దుర్వినియోగం అవుతున్న వాటిలో ఒకటని వ్యాఖ్యానించారు.

ALSO READ: Trump golden statue : US క్యాపిటల్ వద్ద ట్రంప్ బంగారు విగ్రహం.. స్పెషాలిటీస్ ఏంటో తెలుసా!

భారతీయులపై ప్రభావం

అమెరికా ఏటా జారీ చేసే 85,000 H-1B వీసాలలో దాదాపు 71% నుంచి 75% వరకు భారతీయులే దక్కించుకుంటున్నారు. సుమారు 3 లక్షల మంది భారతీయ నిపుణులు ప్రస్తుతం H-1B వీసాలపై అమెరికా టెక్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త ఫీజు విధానం వీరి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారత ఐటీ దిగ్గజాలు H-1B వీసాలపై ఎక్కువగా ఆధారపడతాయి. ఈ కొత్త విధానం వల్ల ఈ కంపెనీలపై బిలియన్ల డాలర్ల భారం పడనుంది. నాస్కామ్ (NASSCOM) ప్రకారం, ఈ నిర్ణయం వల్ల ప్రాజెక్టుల కొనసాగింపుకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. దీని ప్రత్యక్ష ఫలితంగా అమెరికాలో నియామకాలు తగ్గించి, ఆ ఉద్యోగాలను తిరిగి భారతదేశానికి తరలించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

విమర్శలు చట్ట విరుద్ధం..

ఈ నిర్ణయం వెలువడిన సమయంలోనే, ట్రంప్ మీడియాపై కూడా విరుచుకుపడటం గమనార్హం. తన ప్రభుత్వం గురించి ప్రతికూల వార్తలు రాయడం “చట్టవిరుద్ధం” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు అమెరికాలో ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. సెప్టెంబర్ 21, 2025 నుంచి ఈ కొత్త వీసా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో, వేలాది మంది భారతీయ ఉద్యోగుల భవిష్యత్తు, వారి కుటుంబాల పరిస్థితి, భారత ఐటీ పరిశ్రమ భవితవ్యం ఏమిటనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.

ALSO READ: Donald Trump: ట్రంప్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. 60 రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad