Trump’s mediation claims in Indo-Pak conflict : భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోయి మూడు నెలలు దాటినా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆ ఘర్షణను వదలడం లేదు. తానే ఆ యుద్ధాన్ని ఆపానని, తానే శాంతి దూతనని ఇప్పటికి నలభై సార్లకు పైగా చెప్పుకున్నారు. ఇప్పుడు అదే పాత పాటకు, కొత్త లెక్కలు జోడించి మరోసారి ప్రపంచం ముందు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం ఐదు జెట్లు కూలాయని చెప్పిన ట్రంప్, ఇప్పుడు ఆ సంఖ్యను ఏడుకు పెంచారు.
భారత్-పాక్ మధ్య జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘర్షణను ఆపింది తానేనని డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా వైట్‌హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు, భారత్ అధికారిక వాదనకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
సుంకాల బెదిరింపుతోనే యుద్ధం ఆగింది: ట్రంప్ వాదన : తాను వాణిజ్యపరమైన ఒత్తిడిని ఉపయోగించి యుద్ధాన్ని ఆపానని ట్రంప్ చెప్పుకొచ్చారు. “నా దగ్గర సుంకాలు, వాణిజ్యం అనే శక్తిమంతమైన అస్త్రాలు ఉన్నాయి. నేను వాళ్లతో స్పష్టంగా చెప్పాను – ‘మీరు పోరాడుతూ అందరినీ చంపుకోవాలనుకుంటే అది మీ ఇష్టం, కానీ మేం మీ నుంచి వచ్చే ప్రతి వస్తువుపై 100% సుంకం విధిస్తాం’ అని హెచ్చరించాను. అంతే, వెంటనే వాళ్లు యుద్ధం ఆపేశారు” అని ట్రంప్ తెలిపారు.
అణు యుద్ధాన్ని ఆపా.. 24 గంటల్లో పరిష్కరించా : పరిస్థితి అణుయుద్ధం వైపు వెళ్తోందని తాను గ్రహించానని ట్రంప్ అన్నారు. “భారత్, పాకిస్థాన్ యుద్ధం అణు యుద్ధంగా మారే దశకు వచ్చింది. అప్పటికే 7 జెట్లను కూల్చివేశారు. నేను వారికి ఫోన్ చేసి, ‘మీరు మాతో వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? పోరాడుతూనే ఉంటే మేం మీతో వ్యాపారం చేయం. దీన్ని పరిష్కరించుకోవడానికి మీకు 24 గంటలు సమయం ఇస్తున్నా’ అని చెప్పాను. దానికి వారు, ‘సరే, మేం యుద్ధం ఆపేస్తున్నాం’ అని బదులిచ్చారు” అని ట్రంప్ వివరించారు.
మారుతున్న లెక్కలు.. గందరగోళం : ట్రంప్ వ్యాఖ్యల్లోని పొంతనలేనితనం స్పష్టంగా కనిపిస్తోంది. జూలైలో ఆయన మాట్లాడుతూ, ఘర్షణలో ఐదు ఫైటర్ జెట్లు కూలిపోయాయని అన్నారు. ఇప్పుడు ఆ సంఖ్యను ఏడుకు పెంచారు. అయితే, ఆ జెట్లు ఏ దేశానివి, ఏ రకానికి చెందినవి అనే వివరాలు మాత్రం ఆయన చెప్పలేదు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత వాయుసేన కనీసం ఐదు పాకిస్థాన్ యుద్ధ విమానాలను, ఒక నిఘా విమానాన్ని ధ్వంసం చేసిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన అధికారిక ప్రకటన విడుదల చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
భారత్ వాదన ఏంటి : ట్రంప్ వాదనను భారత్ మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తూనే ఉంది.
ఆపరేషన్ సిందూర్: ఏప్రిల్ 22న పహల్గాంపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, మే 7న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి, వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది.
మూడో పక్షం జోక్యం లేదు: కాల్పుల విరమణ అనేది ఇరు దేశాల సైన్యాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) మధ్య ప్రత్యక్ష చర్చల తర్వాతే కుదిరింది. ఇందులో ఏ మూడో దేశం జోక్యం లేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఆపరేషన్‌ను ఆపమని ఏ దేశ నాయకుడూ తమను కోరలేదని ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులోనూ తేల్చిచెప్పారు. అయినప్పటికీ, ట్రంప్ తన పాత పాటే పాడుతూ, అంతర్జాతీయ వేదికలపై తనను తాను శాంతి దూతగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.


