Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Trump on India : పుతిన్‌తో భేటీకి ముందు.. రష్యా చమురు క్లయింట్‌గా భారత్ లేదన్న...

Trump on India : పుతిన్‌తో భేటీకి ముందు.. రష్యా చమురు క్లయింట్‌గా భారత్ లేదన్న ట్రంప్!

Trump on India oil imports :  ఒకవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై కఠినమైన సుంకాలు విధిస్తూ, మరోవైపు రష్యా తన అతిపెద్ద క్లయింట్‌లలో ఒకరైన భారత్‌ను “కోల్పోయింది” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కీలక సమావేశానికి ముందు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వాస్తవాలకు పూర్తి విరుద్ధంగా ఉండటంతో అంతర్జాతీయ దౌత్య, వాణిజ్య వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అసలు వాస్తవాలు ఏం చెబుతున్నాయి..? పుతిన్‌తో భేటీకి ముందు భారత్‌పై ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక వ్యూహం ఏంటి..?

- Advertisement -

ట్రంప్ ఏమన్నారంటే : అలస్కాలో పుతిన్‌తో భేటీకి ముందు మీడియా ట్రంప్‌ను ఆర్థిక అంశాలపై ప్రశ్నించింది. దానికి సమాధానంగా ఆయన భారత్ ప్రస్తావన తీసుకొచ్చారు. “వారు (రష్యా) ఒక కీలక చమురు క్లయింట్‌ను కోల్పోయారు. అదే భారత్. రష్యా నుంచి దాదాపు 40% చమురును దిగుమతి చేసుకుంటోంది. అవసరమైతే నేను సెకండరీ ఆంక్షలు విధిస్తాను. బహుశా ఆ అవసరం రాకపోవచ్చు,” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలోనే వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు భారత్‌ను రష్యా కోల్పోయిందని చెబుతూనే, మరోవైపు 40% దిగుమతి చేసుకుంటోందని అంగీకరించడం గమనార్హం.

అంకెలు చెబుతున్న అసలు నిజం : ట్రంప్ వాదనకు, వాస్తవ గణాంకాలకు మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. డేటా విశ్లేషణ సంస్థ ‘కెప్లర్’ నివేదిక ప్రకారం..

యుద్ధానికి ముందు: భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2 శాతం మాత్రమే.

యుద్ధం తర్వాత: పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో, భారత్ రష్యా నుంచి రాయితీ ధరలకు భారీగా చమురు కొనుగోలు చేయడం ప్రారంభించింది. దీంతో రష్యా వాటా ఏకంగా 35-40 శాతానికి ఎగబాకింది.

ప్రస్తుత పరిస్థితి: ఈ ఆగస్టు నెలలో భారత్ రోజుకు సగటున 52 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకోగా, అందులో ఏకంగా 38 శాతం రష్యా నుంచే రావడం గమనార్హం. ఈ లెక్కలు చూస్తే, రష్యా భారత్‌ను కోల్పోవడం కాదు, చమురు వాణిజ్యంలో భారత్‌కు అతిపెద్ద భాగస్వామిగా అవతరించిందని స్పష్టమవుతోంది.

తాటాకు చప్పుళ్లు.. బెదరని భారత్ : రష్యాతో చమురు వాణిజ్యాన్ని నిలిపివేయాలని అమెరికా చేస్తున్న హెచ్చరికలను భారత్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. తమ జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహించిన ట్రంప్, కొద్ది రోజుల క్రితమే భారత దిగుమతులపై అదనపు సుంకాలను ప్రకటించారు. “రష్యా ఫెడరేషన్ నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ దిగుమతులపై అదనపు సుంకం విధించడం అవసరం,” అని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే 25 శాతం సుంకాలు అమల్లోకి రాగా, మిగిలినవి ఆగస్టు 27 నుంచి అమలు కానున్నాయి. ఒకవైపు చర్యలు తీసుకుంటూనే, మరోవైపు అందుకు విరుద్ధంగా మాట్లాడటం ట్రంప్ ద్వంద్వ వైఖరిని లేదా చర్చల వ్యూహాన్ని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad