US-India trade negotiations halt: భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై నెలకొన్న ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంతో కస్సుమంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు జరిపే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలన్న భారత్ ఆశలపై నీళ్లు చల్లారు. మరోవైపు “రైతుల ప్రయోజనాలే ముఖ్యం, వెనక్కు తగ్గేది లేదు” అని ప్రధాని మోదీ దీటుగా స్పందించారు. ఈ మాటల యుద్ధం తీవ్రమవుతున్న వేళ, అమెరికా విదేశాంగ శాఖ నుంచి భిన్నమైన స్వరం వినిపించడం గందరగోళానికి తావిస్తోంది. అసలు వైట్‌హౌస్ వ్యూహం ఏంటి..? ఈ వాణిజ్య సమరం ఎటు దారితీయనుంది..?
సుంకాల సమరం.. చర్చలకు బ్రేక్: భారత్‌తో వాణిజ్య చర్చల పునరుద్ధరణపై ఓ వార్తా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో కఠినంగా బదులిచ్చారు. టారిఫ్‌ల వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండవని ఆయన తేల్చి చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని హెచ్చరించినా భారత్ లెక్కచేయకపోవడంతో, ట్రంప్ సర్కార్ ప్రతీకార చర్యలకు దిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే 25% సుంకాలు విధించిన అమెరికా, దానికి అదనంగా మరో 25% పెనాల్టీ సుంకాన్ని ప్రకటించింది. దీంతో అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ వస్తువులపై మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. పెంచిన ఈ అదనపు 25% సుంకాలు ఈ ఆగస్టు 27వ తేదీ నుంచి అమలు కానున్నాయి.
ALSO READ: https://teluguprabha.net/international-news/netanyahu-offers-advice-modi-trump/
రైతే రాజు.. వెనక్కు తగ్గేది లేదు ప్రధాని మోదీ: ట్రంప్ బెదిరింపులకు భారత్ తలొగ్గలేదు. ప్రధాని నరేంద్ర మోదీ సుంకాల పెంపుపై తీవ్రంగా, అంతే ధీటుగా స్పందించారు. “దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. వారి సంక్షేమాన్ని కాపాడటానికి వ్యక్తిగతంగా ఎంత మూల్యమైనా చెల్లించడానికి నేను సిద్ధం. ఈ విషయంలో భారత్ ఎన్నటికీ వెనక్కు తగ్గదు” అని మోదీ తేల్చిచెప్పారు. అవసరమైతే ఆ భారాన్ని ప్రభుత్వమే మోస్తుందని, కర్షకులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.
వైట్‌హౌస్‌కు విదేశాంగ శాఖ కౌంటర్: ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఆయన యంత్రాంగంలోని విదేశాంగ శాఖ మాత్రం భిన్నమైన ప్రకటన చేయడం గమనార్హం. అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ విలేకరులతో మాట్లాడుతూ, “భారత్, అమెరికాకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి” అని పేర్కొన్నారు. సుంకాల విషయంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే, “భారత్‌తో మేము పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతాం” అని స్పష్టం చేశారు. అయితే, రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి విషయాల్లో అధ్యక్షుడు ట్రంప్ వైఖరి చాలా స్పష్టంగా ఉందని కూడా ఆయన జోడించారు. ఒకే అంశంపై వైట్‌హౌస్, విదేశాంగ శాఖల నుంచి భిన్న ప్రకటనలు రావడం, అమెరికా అంతర్గత విధానాల్లోని గందరగోళాన్ని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.


