Trump Melania Helicopter Video: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా హెలికాప్టర్‌లో గొడవపడుతున్నట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. మెలానియా వైపు ట్రంప్ వేలు చూపిస్తూ ఆవేశంగా మాట్లాడిన వీడియో ఒకటి బయటకు రావడంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో వీరు గొడవ పడ్డారంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి హాజరయ్యారు. సమావేశాల అనంతరం మెరైన్ వన్ హెలికాప్టర్‌లో ట్రంప్ దంపతులు తిరుగు పయనమయ్యారు. ఆ సమయంలో హెలికాప్టర్‌లో ఎదురెదురుగా కూర్చున్న ట్రంప్-మెలానియా ఒకరివైపు ఒకరు వేలు చూపించుకుంటూ మాట్లాడుతూ కనిపించడాన్ని.. బయట నుంచి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత వారు యధావిధిగా హెలికాప్టర్ దిగి వెళ్లిపోయారు.
వీడియోను చూస్తే వారిద్దరూ ఏదో విషయంపై గొడవ పడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా ట్రంప్-మెలానియా దంపతులు గొడవ పడుతున్నారంటూ చర్చించుకుంటున్నారు. కాగా, ఈ సమావేశాలకు వెళ్లే ముందు ట్రంప్ దంపతులు ఎక్కిన ఎస్కలేటర్ ఆగిపోయిన విషయం తెలిసిందే. దాని గురించే ఇద్దరూ చర్చించుకుంటున్నట్లు భావిస్తున్నారు. కాగా ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్, మెక్రాన్ దంపతులు గొడవపడ్డ వీడియో ఒకటి తీవ్ర చర్చనీయాంశమైంది.


