Donald Trump Nobel Peace Prize bid : ప్రపంచమంతా అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి కోసం ఎదురుచూస్తుంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆ పురస్కారం తనకే దక్కాలని గట్టిగా పట్టుబడుతున్నారు. అంతటితో ఆగకుండా, ఒకవేళ తనకు బహుమతి రాకపోతే అది అమెరికాకే అవమానం అంటూ సరికొత్త రాగం అందుకున్నారు. అక్టోబర్ 10న విజేతను ప్రకటించనున్న నేపథ్యంలో ట్రంప్‌లో టెన్షన్ తారస్థాయికి చేరింది. అసలు ట్రంప్‌నకు నోబెల్ పురస్కారంపై ఎందుకింత ఆరాటం..? ఆయనను నామినేట్ చేస్తున్న దేశాల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలేంటి..? సొంత దేశంలోనే వ్యతిరేకత ఎందుకు వ్యక్తమవుతోంది..?
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరాటాన్ని కొన్ని దేశాలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై తమ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.
అండ కోసం.. నోబెల్ దండ
పాకిస్థాన్ ఎత్తుగడ: అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఊతమిస్తోందని ముద్రపడిన పాకిస్థాన్, ట్రంప్ నోబెల్ ఆశను తనకు అనుకూలంగా వాడుకుంది. భారత్-పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారంటూ ఓ నామినేషన్ పంపింది. దీని ద్వారా అమెరికా నుంచి నిధులు, ఇతర సాయం పొందేందుకు మార్గం సుగమం చేసుకుంటోంది.
ఇజ్రాయెల్ వ్యూహం: గాజాలో కఠిన వైఖరితో విమర్శలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గతంలో బైడెన్ యంత్రాంగం నిలిపివేసిన ఆయుధ సరఫరాను ట్రంప్ పునరుద్ధరించడంతో, కృతజ్ఞతగా నోబెల్ నామినేషన్ పత్రాన్ని స్వయంగా ట్రంప్‌నకే అందించారు. అరబ్ దేశాలతో సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు, ఖతార్‌కు మొక్కుబడిగా క్షమాపణలు చెప్పి మరీ ట్రంప్ అభిమానాన్ని చూరగొన్నారు.
సొంత గడ్డపైనే ప్రతికూలత: విచిత్రం ఏమిటంటే, ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన వారిలో కంబోడియా, అర్మేనియా, అజర్‌బైజాన్ వంటి ఘర్షణల చరిత్ర ఉన్న దేశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఈ నామినేషన్ల వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చని తెలుస్తోంది. నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారం, జనవరి 31లోపు వచ్చిన దరఖాస్తులనే ఆ ఏడాదికి పరిశీలిస్తారు.
మరోవైపు, ఈ విషయంలో ట్రంప్‌నకు సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘న్యూ వాషింగ్టన్ పోస్ట్-ఇప్సాస్’ నిర్వహించిన పోల్‌లో, 76 శాతం మంది అమెరికన్లు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు కాదని తేల్చిచెప్పారు. కేవలం 22 శాతం మాత్రమే ఆయనకు మద్దతు తెలిపారు. ఆయన సొంత రిపబ్లికన్ పార్టీలో కూడా మద్దతు, వ్యతిరేకత సరిగ్గా 49-49 శాతంగా ఉండటం గమనార్హం.
ప్రపంచ నేతల సెటైర్లు.. కమిటీ స్పష్టత : ట్రంప్ ఆరాటంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ సెటైర్లు వేశారు. “నోబెల్ శాంతి బహుమతి కావాలంటే ముందు ఇజ్రాయెల్‌ను కట్టడి చేయండి, గాజా యుద్ధాన్ని ఆపండి” అని పరోక్షంగా చురకలంటించారు. ఈ నేపథ్యంలో, నోబెల్ కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బెర్గ్ హర్ప్వికెన్ స్పందిస్తూ, “బహిరంగ ప్రచారాలు, మీడియా కథనాలు మా నిర్ణయంపై ఎలాంటి ప్రభావం చూపవు. నార్వే పార్లమెంట్ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తుంది,” అని స్పష్టం చేశారు.
అక్టోబర్ 10న విజేతను ప్రకటించనున్న తరుణంలో, ట్రంప్ తన లాబీయింగ్‌ను ముమ్మరం చేశారు. చివరి నిమిషంలో గాజాపై సంధి ప్రతిపాదనలు సిద్ధం చేయించి ఆమోదముద్ర వేయించారు. అయినప్పటికీ, ఫలితంపై తీవ్ర ఒత్తిడితో, “నాకు బహుమతి రాకపోతే అది అమెరికాకే అవమానం” అంటూ తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు.


