Homeఇంటర్నేషనల్Trump: బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్‌ రెహమాన్‌పై ట్రంప్ ప్రశంసలు

Trump: బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్‌ రెహమాన్‌పై ట్రంప్ ప్రశంసలు

ఢాకా(తెలుగుప్రభ): బోయింగ్‌ విమానాల కొనుగోలుకు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. బంగ్లాదేశ్‌ ప్రధాని తారిఖ్‌ రెహమాన్‌తో సమీప భవిష్యత్తులో భేటీ కావాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రెహమాన్‌కు రాసిన లేఖలో ట్రంప్‌ పేర్కొన్నట్లు ఏఎన్‌ఐ వెల్లడించింది. ‘‘బోయింగ్‌ విమానాల కొనుగోలుకు సంబంధించి మీరు పంపిన లేఖ ఇప్పుడే అందింది. ఈ కొనుగోలు నిర్ణయాన్ని నేను ఎంతో అభినందిస్తున్నాను. బోయింగ్‌ మిమ్మల్ని నిరాశపరచదు. ఈ విషయాన్ని నేను మర్చిపోను. దీనిపై మీరు చూపిన శ్రద్ధకు ధన్యవాదాలు. సమీప భవిష్యత్తులో మిమ్మల్ని కలుసుకోవాలని ఎదురుచూస్తున్నాను’’ అని ట్రంప్‌ తన లేఖలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ ప్రజలకు తన తరఫున ఆప్యాయత, శుభాకాంక్షలు తెలియజేయాలనిరెహమాన్‌ను ట్రంప్‌ కోరారు. బంగ్లాదేశ్‌ ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని, అయితే తారిఖ్‌ రెహమాన్‌ నాయకత్వంలో ఆ దేశానికి, ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌ బోయింగ్‌ విమానాల కొనుగోలు నిర్ణయాన్ని అమెరికా దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధి, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ కూడా ప్రస్తావించారు. ట్రంప్‌ అమెరికా చరిత్రలోనే అత్యధిక ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్న అధ్యక్షుడని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ట్రంప్‌ నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. బంగ్లాదేశ్‌ తాజాగా బోయింగ్‌ విమానాల కొనుగోలుకు భారీగా నిధులు వెచ్చించేందుకు అంగీకరించిందని గోర్‌ తెలిపారు. తొలుత నిర్ణయించిన ఆర్డర్‌ను గణనీయంగా పెంచుతూ బిలియన్ల డాలర్ల విలువైన విమానాలను కొనుగోలు చేయడానికి బంగ్లాదేశ్‌ ముందుకొచ్చిందని వెల్లడించారు.

అమెరికాకు చెందిన బోయింగ్‌ సంస్థ నుంచి విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ పౌర విమానయాన, పర్యాటక శాఖ మంత్రి ఎం. రషిదుజ్జమాన్‌ మిల్లత్‌ గతంలో వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తమ ప్రధానిని ‘‘మా బోయింగ్‌ విమానాలను ఉపయోగించండి’’ అని కోరారని, అందుకు అనుగుణంగా బంగ్లాదేశ్‌ 14 బోయింగ్‌ విమానాలను కొనుగోలు చేయడంతో పాటు మరికొన్ని విమానాలను లీజుకు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ విమానాల ఒప్పందం విలువ సుమారు 3.7 బిలియన్‌ డాలర్లుగా స్థానిక మీడియా పేర్కొంది. ఒప్పందం ప్రకారం 2031 నుంచి 2035 మధ్య దశలవారీగా బోయింగ్‌ సంస్థ ఈ విమానాలను బంగ్లాదేశ్‌ జాతీయ విమానయాన సంస్థ బిమాన్‌కు అందించనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News