Russia-Ukraine peace talks : ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌ల శిఖరాగ్ర సమావేశం అలస్కాలోని యాంకరేజ్‌లో జరిగింది. గత మూడేళ్లుగా యూరప్‌ను అతలాకుతలం చేస్తున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలనే లక్ష్యంతో జరిగిన ఈ భేటీలో ఎలాంటి తుది ఒప్పందం కుదరనప్పటికీ, శాంతి దిశగా కీలక అడుగులు పడినట్లు సంకేతాలు వెలువడ్డాయి. కాల్పుల విరమణ వంటి తాత్కాలిక ఉపశమనాల కన్నా, ఇరు పక్షాల మధ్య ప్రత్యక్ష శాంతి ఒప్పందమే శరణ్యమనే బలమైన అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. ఇంతకీ ఈ సమావేశంలో అసలేం జరిగింది..? తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి..?
ఒప్పందమే ఉత్తమం: ట్రంప్ స్పష్టత : సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ చర్చల అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక “ట్రూత్ సోషల్” ద్వారా కీలక విషయాలు వెల్లడించారు. “అలస్కాలో అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం అద్భుతంగా జరిగింది. ఇదొక గొప్ప, విజయవంతమైన రోజు,” అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, నాటో సెక్రటరీ జనరల్‌తో పాటు ఇతర ఐరోపా నేతలతో కూడా ఫోన్‌లో సంభాషించినట్లు ఆయన తెలిపారు. ఈ సంప్రదింపులన్నింటి తర్వాత, యుద్ధాన్ని ముగించడానికి కాల్పుల విరమణ సరైన మార్గం కాదని, అది తరచూ ఉల్లంఘనలకు గురయ్యే ప్రమాదం ఉందని, అందుకే రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష శాంతి ఒప్పందమే ఉత్తమ మార్గమని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ట్రంప్ వివరించారు. ఈ క్రమంలోనే, సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వాషింగ్టన్‌లోని ఓవల్ కార్యాలయానికి రానున్నారని, ఆ చర్చలు సఫలమైతే, పుతిన్‌తో తదుపరి సమావేశాన్ని ఏర్పాటు చేసి లక్షలాది మంది ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చర్చలు ఫలప్రదం: ఇరు నేతల ప్రకటన : భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. చర్చలు అత్యంత ఫలప్రదంగా జరిగాయని ట్రంప్ పేర్కొనగా, నిర్మాణాత్మక వాతావరణంలో సాగాయని పుతిన్ తెలిపారు. అయితే, కొన్ని కీలక అంశాల్లో పురోగతి సాధించినప్పటికీ, తుది ఒప్పందం ఇంకా కుదరలేదని ఇరువురూ అంగీకరించారు. తదుపరి సమావేశం కోసం మాస్కోకు రావాల్సిందిగా ట్రంప్‌ను పుతిన్ ఆహ్వానించడం గమనార్హం.
భారత్ స్వాగతం: దౌత్యానికే పెద్దపీట : మరోవైపు, అలస్కాలో ట్రంప్, పుతిన్‌ల భేటీని భారత్ మనస్ఫూర్తిగా స్వాగతించింది. శాంతి స్థాపన కోసం ఇరువురు నేతలు చూపుతున్న చొరవ ప్రశంసనీయమని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశంలో సాధించిన పురోగతిని భారత్ అభినందిస్తోందని తెలిపింది. సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్యం మాత్రమే ఏకైక మార్గమని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సంక్షోభానికి త్వరగా తెరపడాలని ప్రపంచం మొత్తం కోరుకుంటోందని, “ఇది యుద్ధ యుగం కాదు” అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశానికి ఈ ప్రయత్నాలు మరింత బలాన్ని చేకూరుస్తాయని విదేశాంగ శాఖ అభిప్రాయపడింది.


