Trump Putin Meeting : అగ్రరాజ్యాల అధినేతల భేటీ అంటేనే ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మధ్య అలస్కాలో జరిగిన సమావేశం మాత్రం అసాధారణ రీతిలో వార్తల్లోకెక్కింది. చిరునవ్వులతో పలకరింపులు, కరచాలనాల మాటున.. నింగిని చీల్చుకుంటూ దూసుకెళ్లిన అణుబాంబు సామర్థ్యం గల బీ-2 బాంబర్లు! ఇది స్నేహపూర్వక స్వాగతమా..? లేక చర్చలకు ముందే ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరుగెత్తించే బల ప్రదర్శనా..? మాటలతో లొంగకపోతే చేతలేంటో చూపిస్తానన్న ట్రంప్ పరోక్ష హెచ్చరికా..? పుతిన్‌ను చూసి ట్రంప్ వేసిన ఈ వ్యూహాత్మక ఎత్తుగడ వెనుక అసలు కథేంటి..?
అలస్కాలో అసాధారణ స్వాగతం : ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అలస్కాలోని ‘జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్-రిచర్డ్‌సన్’ సైనిక స్థావరానికి చేరుకున్నారు. ఆయన కంటే ముందే అక్కడికి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పుతిన్‌కు సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ చిరునవ్వులతో కరచాలనం చేసుకున్నారు. అయితే అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. ఇరువురు నేతలు పోడియం వైపు నడుస్తుండగా, వారి తలల పైనుంచి గగనతలంలో గర్జిస్తూ అత్యంత శక్తిమంతమైన బీ-2 స్టీల్త్ బాంబర్లు, వాటికి రక్షణగా పలు ఫైటర్ జెట్లు దూసుకెళ్లాయి. అంతేకాదు, వారి కాన్వాయ్ వెళ్లే మార్గానికి ఇరువైపులా అత్యాధునిక యుద్ధ విమానాలను వరుసగా నిలిపి ఉంచారు. అమెరికా సైనిక పాటవాన్ని కళ్లకు కట్టినట్లు చూపిన ఈ ప్రదర్శన చూసి పుతిన్ సైతం ఒకింత ఆశ్చర్యానికి లోనైనట్లు కనిపించారు.
ALSO READ: https://teluguprabha.net/international-news/zelenskyy-trump-phone-call-washington-meeting/
బల ప్రదర్శనా – గౌరవ సూచకమా : పుతిన్‌కు స్వాగతం పలికిన తీరుపై ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన సైనిక విన్యాసం కాదని, ఉక్రెయిన్ యుద్ధంపై జరిగే కీలక చర్చలకు ముందు ట్రంప్ ఉద్దేశపూర్వకంగా వేసిన ‘పవర్ ప్లే’ అని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చర్చలు విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన ట్రంప్, తన మాటలకు చేతల బలాన్ని జోడించి పుతిన్‌కు ఒక బలమైన సందేశం పంపారని వారు అభిప్రాయపడుతున్నారు.
బీ-2 బాంబర్లు సాధారణమైనవి కావు : ఈ ప్రదర్శనలో ఉపయోగించిన బీ-2 బాంబర్లు అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న అత్యంత శక్తిమంతమైనవి. రాడార్లకు సైతం సులభంగా చిక్కని ఈ ‘స్టీల్త్’ విమానాలను అమెరికా అత్యంత కీలకమైన ఆపరేషన్లలో మాత్రమే ఉపయోగిస్తుంది. ఈ ఏడాది జూన్‌లో ఇరాన్‌లోని యురేనియం శుద్ధి కేంద్రాలపై దాడికి అమెరికా వీటినే వాడిందని సమాచారం. అలాంటి బాంబర్లను పుతిన్ రాక సందర్భంగా ప్రదర్శించడం కచ్చితంగా ఒక వ్యూహాత్మక హెచ్చరికేనని పలువురు భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో భిన్న వాదనలు : ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పుతిన్‌ను అవమానించడమేనని, ఒకప్పటి తమ భూభాగమైన అలస్కాలో సమావేశం పెట్టి, అక్కడ సైనిక ప్రదర్శనతో రష్యాను రెచ్చగొడుతున్నారని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం, ఒక దేశాధినేతకు సైనిక గౌరవ వందనం సమర్పించడం సాధారణమేనని, ఇది పుతిన్‌కు లభించిన ‘వీఐపీ స్వాగతం’ అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ట్రంప్, పుతిన్ ఇద్దరి ముఖాల్లో చిరునవ్వులు కనిపించినప్పటికీ, వారి బాడీ లాంగ్వేజ్‌ను అంచనా వేయడం అంత సులభం కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ మొత్తం ప్రదర్శనపై పెంటగాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం ఈ చర్చకు మరింత ఆజ్యం పోస్తోంది.


